లేజర్ చికిత్స లేక కిడ్నీ రోగుల పాట్లు...
వేసవి కాలం వచ్చిందంటే చాలు కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరు యూరాలజిస్టులు ఉన్నా కిడ్నీలో రాళ్లకు చికిత్స చేసేందుకు తగిన వైద్య పరికరాలు లేకపోవడంతో వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉంది. కిడ్నీలో రాళ్ల కు చికిత్స చేయించుకునేందుకు వచ్చిన రోగులను గుంటూరుకు రిఫర్ చేసి మిన్నకుండి పోతున్నారు. దీంతో నిరుపేద సామాన్య రోగులు ఇబ్బందులు వర్ణనాతీతం. కిడ్నీలో రాళ్లకు సాధారణంగా లేజర్ ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇంత పెద్ద ఆస్పత్రిలో లేజర్ వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రోగులు వాపోతున్నారు. కిడ్నీలో రాళ్ల కేసులే కాకుండా గుండె జబ్బులు, షుగర్, రక్తపోటు రోగుల్లో కిడ్నీలు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యుల చెబుతున్నారు. జిల్లాలో కనిగిరి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కిడ్నీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల గుండె జబ్బులు కూడా ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో లేజర్ వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.


