అమరజీవి అంటే అంత నిర్లక్ష్యమా లోకేష్?
ఒంగోలు టౌన్: పొట్టి శ్రీరాములు పుట్టిన ఊరు పడమటిపల్లికు పది కిలోమీటర్ల దూరంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరజీవి గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం అమరజీవి పట్ల ఆయన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పేరకం నాగాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. యువగళం యాత్ర సందర్భంగా కూడా అలవపాడు వరకు పాదయాత్ర చేశారని, పొట్టి శ్రీరాములు కోసం మరో పది కిలోమీటర్లు పాదయాత్ర చేయకపోవడం బాధాకరమన్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసి ఆ మహనీయుడి త్యాగాలను గౌరవించారని తెలిపారు. అలాగే 2014లో నాటి చంద్రబాబు ప్రభుత్వం మార్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 2019లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే నవంబర్ 1వ తేదీకి మార్చి పొట్టిశ్రీరాములు పట్ల గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వారసులను సన్మానించే సమయంలో మారెళ్ల ఆసుపత్రిని బాగు చేయిస్తామని చెప్పారని, నేటికి నాలుగు నెలలు గడిచినా హాస్పిటల్ భవనానికి కనీసం సున్నం కూడా కొట్టలేదన్నారు.
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
మార్కాపురం టౌన్: అతిగా మద్యం తాగి అనారోగ్యానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని వడ్డె బజారుకు చెందిన కుంచాల ఆంజనేయులు(35) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లోనే మద్యం తాగాడు. రాత్రి సమయంలో తీవ్రమైన కడుపునొప్పిరావడంతో కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
ముండ్లమూరు(కురిచేడు): మండలంలోని చంద్రగిరి సమీపంలోని శ్రీరామ్ డెయిరీ వద్ద గేటు పక్కన రోడ్ మార్జిన్‌లో ఉన్న నీటి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన మహేష్‌బాబు(37) ఆదివారం ఉగాది పండుగ రోజున ముండ్లమూరులోని తన సోదరుడు హనుమంతరావు ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి విఠలాపురం వెళుతూ చంద్రగిరి సమీపంలోని సైడ్‌కాలువలో పడి మృతిచెందాడు. నీరు ఎక్కువగా ఉండటంతో మృతదేహం కనిపించలేదు. నీరు తగ్గిన తరువాత మృతదేహం బయటపడటంతో ఆ రోడ్డున వెళ్లే వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహం వద్ద ఆనవాళ్లు పరిశీలించగా మృతుడు విఠలాపురం గ్రామానికి చెందిన మహేష్‌బాబుగా నిర్ధారించారు. మృతుని తల్లి ఘటనా స్థలానికి వచ్చి తన కుమారుడేనని నిర్ధారించి బోరున విలపించింది. పోస్టుమార్టం అనంతరంమృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.


