పోస్టల్ అండ్ పెన్షనర్ల అసోసియేషన్ నిరసన
ఒంగోలు వన్‌టౌన్: ఆలిండియా పోస్టల్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని హెడ్‌పోస్టాఫీసు ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగ విరమణ చేసిన వారి హక్కులను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోందన్నారు. ప్రస్తుతం–భవిష్యత్తులో ఉద్యోగ విరమణ చేసిన వారి మధ్య వివక్షత లేకుండా న్యాయం చేయాలన్నారు. అన్ని పెన్షన్‌దారులకు 8వ వేతన కమిషన్ ప్రయోజనాలను సమానంగా పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌క్యూ ఉపాధ్యక్షుడు డి.మోహనరావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, కె.వీరాస్వామిరెడ్డి, పి.పేరయ్య, టి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రేపు జగ్జీవన్‌రామ్ జయంతి
ఒంగోలు సబర్బన్: డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి, అంబేడ్కర్ భవనానికి వెళ్లేదారిలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం అంబేడ్కర్ భవనంలో సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంఘ నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


