చేతికొచ్చిన పంట నేలపాలు | - | Sakshi
Sakshi News home page

చేతికొచ్చిన పంట నేలపాలు

Apr 5 2025 2:22 AM | Updated on Apr 5 2025 2:29 AM

చేతిక

చేతికొచ్చిన పంట నేలపాలు

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు వివిధ రకాల పంటలు 215 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రాంతంలో గురువారం సాధారణ స్థాయి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రధానంగా మూడు మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అందులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని పంటలు 194 హెక్టార్లు కాగా, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలోని పంటలు 21 హెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న 178.40 హెక్టార్లలో దెబ్బతింది. అలసంద 10 హెక్టార్లలో, వరి 4.04 హెక్టార్లలో, మినుము ఒక హెక్టారులో, అరటి 11 హెక్టార్లు కాగా, బొప్పాయి 8 హెక్టార్లలో, కూరగాయలు 2 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. వాస్తవానికి పంట నష్టం ఇంకా ఎక్కువగానే ఉంది. సీఎస్‌పురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, పుల్లలచెరువు, కొమరోలు, యర్రగొండపాలెం మండలాల్లోని మొత్తం 262 మంది రైతులు తమ పంటలను నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.

35.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది

జిల్లాలో గురువారం పలు మండలాల్లో 35.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా యర్రగొండపాలెంలో 6.6 సెం.మీ, పుల్లలచెరువులో 4.6 సెం.మీ వర్షం కురిసింది. కొమరోలులో 2.6, త్రిపురాంతకంలో 2.4, బేస్తవారిపేటలో 2.4 కురవగా 1.7 నుంచి 1.1 సెంటీ మీటర్లు దోర్నాల, దొనకొండ, అర్థవీడు, కొనకనమిట్ల, పెద్దారవీడు, పొదిలి, దర్శి, వెలిగండ్ల మండలాల్లో కురిసింది. కురిచేడు, హనుమంతునిపాడు, గిద్దలూరు, కనిగిరి, తర్లుపాడు, రాచర్ల, మార్కాపురం, కంభం, పామూరు మండలాల్లో చిరుజల్లులు మొదలుకొని ఒక మోస్తరు వర్షం కురిసింది. మిగతా 16 మండలాల్లో వర్షం లేదు.

అరటి రైతుల ఆక్రందన

కంభం: కంభం మండలంలో గురువారం సాయంత్రం, అర్ధరాత్రి ఓ మోస్తారు వర్షం కురిసినప్పటికీ పెనుగాలులు తీవ్రంగా వీచడంతో కంభం చెరువు ఆయకట్టు కింద సాగవుతున్న పలు అరటి తోటలు నేలకొరిగాయి. కంభం, పోరుమామిళ్లపల్లి, చింతలపాలెం, సోమవారిపేట, హజరత్‌గూడెం, కాగితాల గూడెం పరిధిలో సుమారు 250–300 ఎకరాల్లో అరటి తోటలు సాగులో ఉన్నాయి. కొందరి అరటి తోటలు కోత దశలో ఉండగా, మరికొందరి తోటలు వివిధ దశల్లో ఉన్నాయి. వీచిన పెనుగాలులకు చిన్నకంభం, పోరుమామిళ్లపల్లి పరిధిలో కోత దశలో ఉన్న సుమారు 20 ఎకరాల్లో అరటి తోటలు గెలలతో సహా నేలకొరిగిపోయాయి. ఇంకా కొందరు రైతులకు చెందిన తోటల్లో ఎకరాకు 100–150 చెట్ల వరకు నేల కొరిగిపోవడంతో రూ.40 – రూ.50 లక్షల పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న అరటి తోటలు ఇలా ఒక్కసారిగా నేలకొరిగి పోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కొమరోలులోనూ..

కొమరోలు: మండలంలో గురువారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులు, వర్షానికి 30 ఎకరాల్లో అరటిపంట నష్టం వాటిల్లినట్లుగా రైతులు తెలిపారు. బ్రాహ్మణపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో భారీ ఈదురు గాలులు వీయడంతో ఆ ప్రాంతంలోనే అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. 10 రోజుల్లో అరటి గెలలు కోయడానికి సిద్ధమవుతున్న రైతులు అవి నేలమట్టం కావడంతో లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

పిడుగు పాటుకు 3 గేదెలు మృతి

ఈదురు గాలులు, భారీ వర్షం, పిడుగులు పడడంతో కొమరోలు మండలంలో 3 గేదెలు మృతిచెందాయి. మండలంలోని ఇడమకల్లు గ్రామంలో మల్లెపోగు యాకోబుకు చెందిన రెండు గేదెలను పాక సమీపంలో కట్టివేసి ఉంచగా పిడుగుపాటుకు రెండు గేదెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మదవపల్లె గ్రామంలో పీరయ్యకు చెందిన ఒక గేదె పిడుగుపాటుకు మృతిచెందింది.

446 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం

బేస్తవారిపేట: అకాల వర్షాలకు 446 ఎకరాల్లోని మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారిణి జక్కం మెర్సీ తెలిపారు. మండలంలోని బసినేపల్లె, ఎంపీ చెరువు, పీవీ పురం, పూసలపాడు, మోక్షగుండం గ్రామాల్లో మొక్కజొన్న పంట గాలులకు నేలకొరిగిందన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రాథమిక నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. మండలంలోని జెన్నివారిపల్లె, గలిజేరుగుళ్ల, అక్కపల్లె, గంటాపురం గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌శాఖ అధికారులు నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు.

అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు నష్టం

యర్రగొండపాలెం: అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం కురిసిన ఈ వర్షం వలన 35 ఎకరాల్లో వేసిన బొప్పాయి, అరటి, టమోటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉద్యాన శాఖాధికారి ఆదిరెడ్డి తెలిపారు. యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి, పందివానిపల్లె, పుల్లలచెరువు మండలంలోని రాచకొండ గ్రామాల్లో 12 మంది రైతులు 28 ఎకరాల్లో వేసిన బొప్పాయి పంట గాలి, వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో వారికి దాదాపు రూ.28 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో 4 ఎకరాల్లో వేసిన టమోటాకు రూ.2.80 లక్షలు, 3 ఎకరాల్లో వేసిన అరటి పంటకు రూ.6.75 లక్షల వరకు నష్టపోయి ఉంటారన్నారు.

జిల్లాలో అకాల వర్షాలకు 215 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు మూడు మండలాల్లోని 262 మంది రైతులకు నష్టం పెనుగాలులకు నేలకొరిగిన అరటి, బొప్పాయి తోటలు పిడుగుపాటుకు మూడు గేదెల మృతి నష్టపరిహారం అందించాలంటున్న రైతులు

మరో పది రోజుల్లో పంట చేతికి వస్తుందనే ఆనందంతో ఉన్న రైతులకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆనందంగా ఉన్న రైతుల కుటుంబాల్లో ప్రకృతి ప్రకోపం కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంటలు ఒక్క గాలివానకు నేలకొరిగి పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

కాపుపై ఉన్న బొప్పాయి పంట నష్టపోయా

రెండు ఎకరాల్లో బొప్పాయి పండిస్తున్నాను. మంచి కాపుపై ఉన్న సమయంలో అకాల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతింది. దీనివలన రూ.1.80 లక్షల వరకు నష్టపోయాను.

– టి.నాగయ్య, కొమరోలు

అరటి గెలలతో సహా చెట్లు నేలకొరిగాయి

రెండున్నర ఎకరాల్లో అరటి తోట వేశాను. చెట్లన్నీ గెలలు కాసి కోతకు వచ్చి ఉన్నాయి. మార్కెట్‌లో ధర కూడా ఉండటంతో పెట్టుబడులు వస్తాయని నమ్మకంగా ఉండగా గురువారం రాత్రి వీచిన గాలులకు గెలలతో సహా చెట్లు నేలకొరిగిపోయాయి. అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.

– షేక్‌ ఇబ్రహీం, అరటి రైతు, కంభం

ప్రభుత్వం ఆదుకోవాలి

చిన్నకంభం ఇలాఖాలో మూడు ఎకరాల్లో అరటి తోట వేశాను. ఇప్పుడే గెలలు కోతకు వచ్చాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచుకున్న అరటి తోటలు ఆకస్మికంగా వీచిన గాలులకు ఇలా నేలకొరిగిపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంటనష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– మజీద్‌, అరటి రైతు

చేతికొచ్చిన పంట నేలపాలు1
1/5

చేతికొచ్చిన పంట నేలపాలు

చేతికొచ్చిన పంట నేలపాలు2
2/5

చేతికొచ్చిన పంట నేలపాలు

చేతికొచ్చిన పంట నేలపాలు3
3/5

చేతికొచ్చిన పంట నేలపాలు

చేతికొచ్చిన పంట నేలపాలు4
4/5

చేతికొచ్చిన పంట నేలపాలు

చేతికొచ్చిన పంట నేలపాలు5
5/5

చేతికొచ్చిన పంట నేలపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement