‘మీ కోసం’కు అత్యంత ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవన్‌లోని గ్రీవెన్స్ భవనంలో సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణతో కలిసి జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్‌లైన్‌లో వచ్చే వినతులను కూడా చూడాలన్నారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్ర స్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. అలాంటి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సదరం స్లాట్ల సంఖ్య పెంచాలి:
ఒంగోలు టౌన్: వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సదరం స్లాట్ల సంఖ్యను పెంచాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు కోరారు. ఈ మేరకు డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జిల్లాలో ఒంగోలు, గిద్దలూరుల్లో మాత్రమే సదరం సెంటర్లు ఉన్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా జరిగే సదరం క్యాంపులను కూటమి ప్రభుత్వం వచ్చాక వెరిఫికేషన్ల పేరుతో ఆరు నెలలుగా ఆపివేసిందన్నారు. దాంతో అనేక మంది వికలాంగులు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా సదరం స్లాట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు దానియేలు, శివ, రాజు, రోశీబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.
అర్జీదారులతో మాట్లాడిన కలెక్టర్ తమీమ్ అన్సారియా


