రాష్ట్రానికి మంచి చేసే నాయకుడు కావాలి
దర్శి: మంచి చేసే నాయకుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని లంకోజనపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి తిరునాళ్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్సార్ సీపీ యాదవ రాజులు ఏర్పాటు చేసిన ప్రభపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివప్రసాద్‌రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ప్రభపై ఆయన పుట్టిన రోజు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నిజం చెప్పే నాయకుడి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందని, అప్పుడే రాష్ట్ర ప్రజల భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రం బాగు పడాలంటే రాష్ట్రానికి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కావాలని అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఎగ్గొట్టే వారికి సరైన బుద్ధి చెప్పాలని, అప్పుడే అలాంటి అబద్ధపు హామీలు ఇవ్వకుండా ఉంటారని చెప్పారు. దేశంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ హామీలు అమలు చేసిన నాయకుడు ఒక్క మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు కరోనా వంటి విపత్తులు ఎదురొచ్చినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని రాష్ట్రం తన కుటుంబంగా భావించి పేదలకు సంక్షేమం ఆగకుండా అందజేసిన గొప్ప సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో ఆస్పత్రులను కట్టుదిట్టం చేసి పేదలకు కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించారన్నారు.
బీసీలకు పెద్దపీట వేసిన వైఎస్ జగన్:
బీసీలను బ్యాక్ బోన్‌గా నమ్మి వారికి రిజర్వేషన్‌లు కేటాయించి అండగా ఉన్నారని బూచేపల్లి తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసి ఎక్కువ ఎమ్మెల్సీలు ఇచ్చిన నాయకుడు రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగనే అని అన్నారు. గతంలో నామినేటెడ్ పోస్టులు అన్నీ ఓసీలకు ఇచ్చే వారని... జగనన్న వచ్చిన తరువాతే 50 శాతం రిజర్వేషన్‌లు కేటాయించి మహిళలకు, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు నామినేటెడ్ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పించి న్యాయం చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అన్నీ హామీలు వంద శాతం అమలు చేసిన గొప్ప సీఎం ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు బీసీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్‌లు ఇస్తామని చెప్పారని అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీలకు కూడా సంక్షేమం అందించకుండా వారిని చంద్రబాబు దారుణంగా మోసగించారన్నారు.
సూపర్ సిక్స్‌పై చేతులెత్తేసిన చంద్రబాబు:
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసెంబ్లీకి వచ్చాక తూర్పు తిరిగి దండం పెట్టి నేను సూపర్ సిక్స్ చేయలేనని చేతులెత్తేశారని బూచేపల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలను చూసిన ప్రజలు గత ప్రభుత్వ పాలనను గుర్తుకు తెచ్చుకుని మేము జగన్ మోహన్‌రెడ్డికి న్యాయం చేయలేక పోయామని బాధపడుతున్నారన్నారు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా...జగనన్నను ఎప్పుడు సీఎం చేసుకుందామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా ఉండి అభయాంజనేయ స్వామి దయతో రానున్న ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, మాజీ సర్పంచ్ కొరివి కోటయ్య, పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి మంచి చేసే నాయకుడు కావాలి


