సంపన్నులకు వరాలు.. సామాన్యులపై భారాలు
ఒంగోలు టౌన్: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టేనాటికి రూ.450గా ఉన్న వంట గ్యాస్ ధర ప్రస్తుతం రూ.900కు చేరుకుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(ఐద్వా) జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. అసలే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వంటగ్యాస్ ధర మరో రూ.50 పెంచడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో నిర్వహించిన ఐద్వా జిల్లా కమిటి సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సంపన్నులకు వరాలు ప్రకటిస్తూ సామాన్యులపై భారాలు మోపుతోందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న మోదీ మాటలకు చేతలకు పొంతన లేదని దుయ్యబట్టారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి దీటుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రజల నెత్తిన ధరల భారం మోపుతోందని విమర్శించారు. వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి జి.ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎన్.మాలతి, ఎస్‌కే నాగుర్‌బీ, కె.రాజేశ్వరి, కె.లక్ష్మీ ప్రసన్న, బి.రాజ్యలక్ష్మి, బి.పద్మ తదితరులు పాల్గొన్నారు.


