అక్రమ రవాణా చేస్తున్న 3 లారీలు పట్టివేత
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్ధం నుంచి బూదవాడ వైపు గ్రానైట్ ముడి రాళ్లు అక్రమ రవాణా చేస్తున్న 2 లారీలు, ఒక టిప్పర్‌ను సేల్‌టాక్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో పట్టుకున్న లారీలను ఏపీఎండీసీ ప్రాంగణానికి తరలించారు.
పూరి గుడిసె దగ్ధం
● రూ.2 లక్షల ఆస్తి నష్టం
యర్రగొండపాలెం: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూరి గుడిసె దగ్ధమైన సంఘటన యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబొట్లపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూజల సత్యనారాయణ కుటుంబం పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఇంటికి నిప్పంటుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేశారు.
హౌరా జనరల్ కోచ్‌లో గుర్తు తెలియని మృతదేహం
ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఫస్ట్ ప్లాట్‌ఫాంపై హౌరా ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుంది. పీచ్‌కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. కుడి చెంప, ఛాతీ మీద పుట్టుమచ్చలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్సై కె.మధుసూధన రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440627647ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
టంగుటూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు..మండలం లోని టంగుటూరు బాపూజీ కాలనీకి చెందిన సవలం వర్ధన్(24) ఒంగోలులో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంటాడు. సోమవారం రాత్రి ఆస్పత్రిలో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా వల్లూరు సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి ఎస్సై చేసుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.
మేలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో మేలో నిర్వహించనున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి డి.సోమసుందర్ కోరారు. మంగళవారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులో మూడోసారి నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్, ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఎ.సురేష్, డి.కనకయ్య, వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, కేవీ సురేష్ రెడ్డి, సీహెచ్ రాంబాబు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
అక్రమ రవాణా చేస్తున్న 3 లారీలు పట్టివేత
అక్రమ రవాణా చేస్తున్న 3 లారీలు పట్టివేత
అక్రమ రవాణా చేస్తున్న 3 లారీలు పట్టివేత


