రెవెన్యూ సదస్సుల్లో సమస్యలపై దృష్టి పెట్టండి
● జిల్లా అధికారులను ఆదేశించిన సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి
ఒంగోలు సబర్బన్: గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సీసీఎల్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. విజయవాడ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రధానంగా రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పీజీఆర్‌ఎస్ పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ సదస్సుల పీజీఆర్‌ఎస్, రీసర్వే, ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పీజీఆర్‌ఎస్ దరఖాస్తులు ఎస్‌ఎల్‌ఎలోపు వెళ్లకుండా గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జేసీతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
బోర్డు అనుమతి మేరకే పొగాకు సాగు మేలు
● పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ
టంగుటూరు: పొగాకు బోర్డు అనుమతించిన మేరకే సాగు చేయడం మంచిదని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ అన్నారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని మంగళవారం సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈడీ విశ్వ శ్రీ మాట్లాడుతూ రైతులంతా మార్కెట్ కు అనుగుణంగా పొగాకు తెచ్చుకొని అమ్మకాలు చేసుకోవాలన్నారు. మండెలలో మగ్గిన పొగాకునే బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలని తెలిపారు. రైతులు ఇప్పుడున్న మార్కెట్ ను చూసి ఖర్చులు పెంచుకోకుండా పొగాకు సాగు ఖర్చును తగ్గించుకోవాలన్నారు. అలాగే రైతులు తీసుకొచ్చిన బేళ్లన్నింటినీ నో బిడ్స్ లేకుండా కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. వేలం కేంద్రానికి కట్టుబడిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల రైతులు 435 బేళ్లు తీసుకొని రాగా అందులో 337 బేళ్లు కొనుగోలు చేశారు. రూ.263.30 సరాసరి ధర నమోదైంది. కార్యక్రమంలో పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, సెక్రటరీ ఇన్‌చార్జ్ దివి వేణుగోపాల్, రీజినల్ మేనేజర్ ఎమ్.లక్ష్మణరావు, వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, బోర్డు సిబ్బంది, టంగుటూరు పొగాకు బోర్డు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో సమస్యలపై దృష్టి పెట్టండి


