యాప్ చిక్కుముడి!
● యాప్‌లతో అంగన్‌వాడీలపై పనిభారం ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్‌లు ● బాలసంజీవని 2.0 వెర్షన్‌తో కొత్త ఇబ్బందులు ● పీడీ కార్యాలయంలో ఫోన్లు వెనక్కి ఇచ్చేసి నిరసన ● పీడీ ఆదేశాలతో ఫోన్లు బలవంతంగా వెనక్కి ఇస్తున్నారన్న ఆరోపణలు ● 5 జీ ట్యాబులు ఇవ్వాలని డిమాండ్ ● ప్రభుత్వ నిబంధనలతో నష్టపోతున్న చిన్నారులు..బాలింతలు
అంగన్‌వాడీ..
జిల్లాలో 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
అంగన్‌వాడీ కేంద్రాలు 2903
ఒంగోలు సిటీ: అంగన్‌వాడీలకు యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లు మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్‌కాక అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే వీరికి యాప్ ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. తొలుత ఫేస్ యాప్ ఓపెన్ చేయాలి. అది ఓకే అయితేనే మిగిలిన యాప్‌లు పనిచేస్తాయి. విధిగా ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్‌వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి.. ఎంత మంది హాజరైతే అంత మందికి మాత్రమే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకూ పిల్లలు వస్తూనే ఉంటారు. ఆ తర్వాత వచ్చిన వారికి ఆహారం ఇచ్చే అవకాశం లేదు. ఇలా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇది అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడంలేదని వారు వాపోతున్నారు. ఇక ఫేస్ యాప్ వేసిన రోజులకే వేతనం ఇస్తోంది. సాంకేతిక సమస్య తలెత్తితే ఆరోజు వేతనం కట్ చేస్తున్నారు. గౌరవ వేతనం ఇస్తున్న తమపై ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా నిబంధనలు విధించడం సరికాదని వారు మండిపడుతున్నారు.
పనిభారంతో అవస్థలు
ప్రభుత్వం కోరిన సమాచారాన్ని యాప్‌ల ద్వారా ఇవ్వడం, రికార్డులు రాయడం, టేక్ హోమ్ రేషన్ పంపిణీ, ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పిల్లల బరువును పరిశీలించడం వంటి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా తమ పై వేసి అదనపు భారాన్ని మోపుతున్నారని అంగన్‌వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇస్తున్నది రూ.11,500 గౌరవ వేతనమేని, ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనిని తమతో చేయిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం సమానంగా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బాలసంజీవని యాప్‌ను సవరణ చేయాలని, ఉద్యోగులతో పాటు తమకు సమాన వేతనాలు ఇవ్వాలని, పింఛన్ల పంపిణీ కార్యక్రమం నుంచి తమను మినహాయించాలని, పనిభారాన్ని తగ్గించాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన 5 జీ ట్యాబ్‌లను అందజేయాలని కోరుతున్నారు. హెల్పర్లు అంగన్‌వాడీ కేంద్రాన్ని శుభ్రం చేయడం, ప్రీస్కూల్ విద్యార్థులకు పోషకాహారం వండి పెట్టడం, గిన్నెలు శుభ్రం చేయడం, పిల్లల వాష్‌రూమ్స్ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నా వీరికి కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాల సంజీవని 2.0తో
పోషణ ట్రాకర్, ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి లబ్ధిదారుల ఫొటో క్యాప్చర్ చేసి సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఫోన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా, నెట్‌వర్క్ లేకపోయినా లబ్ధిదారుల ఫొటో క్యాప్చర్ కాకపోయినా సరుకులు ఇవ్వడం కుదరడం లేదని అంగన్‌వాడీ వర్కర్లు అంటున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన అన్నీ ఫోన్లలో కొన్ని యాప్‌లు ఇన్‌స్టాల్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా బాల సంజీవని 2.0 వెర్షన్‌తో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో వర్కరు, హెల్పరు ఫొటో క్యాప్చర్ చేసి గర్భిణులకు, బాలింతలకు 7–3 , 3–6 వయస్సున్న చిన్నారులకు బాలసంజీవని పంపిణీ చేయాలి. అయితే తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో పోషకాహారం పంపిణీలో నానా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా యాప్‌లు తెచ్చి తమను ఇబ్బందులను గురి చేయడమే కాక, అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనికి మూడు యాప్‌ల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి వస్తోంది. ఇవి సాంకేతిక సమస్యలతో పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్ణయించారు.
కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లు: 5750
పనిచేయని ఫోన్లతో ఎలా ..
సక్రమంగా పనిచేయని ఫోన్లతో ఎలా పనిచేయాలో ప్రభుత్వమే చెప్పాలి. కొత్తగా ప్రవేశపెడుతున్న బాలసంజీవని 2.0 వెర్షన్ ప్రస్తుతం మా వద్ద ఉన్న ఫోన్‌లలో పనిచేయదు. నెట్‌వర్క్ సక్రమంగా ఉండటం లేదు. ప్రకాశం జిల్లాలో 13 ప్రాజెక్టులు ఉంటే అందులో 7 ప్రాజెక్టులు ట్రైబల్ ఏరియా కావడం వల్ల సిగ్నల్ ఉండక అంగన్‌వాడీ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే యాప్‌లు ఓపెన్ కావు. అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించడంతో పాటు కొత్తగా 5 జీ ట్యాబ్‌లను ఇవ్వాలి. పగలు స్కూల్‌లో పని, రాత్రి యాప్‌లతో పనిచేయాల్సి వస్తోంది. ఇన్ని ఇబ్బందులతో పనిచేయడం కష్టంగా ఉంది. అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు కొత్త ట్యాబ్‌లను సమకూర్చాలి.
– ఈదర అన్నపూర్ణ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఒంగోలు
బెదిరింపులు కాదు..
తాము ఎవరినీ బెదిరించలేదు. కార్యకర్తలు తమ ఫోన్లు తీసుకుని వెళ్లి వారి పనులు వారు చేసుకుంటున్నారు. వారి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాను.
– హేనా సుజన్, పీడీ, ఐసీడీఎస్, ఒంగోలు
యాప్ చిక్కుముడి!


