గ్రామవ్యవసాయ సహాయకునిపై దాడి
మర్రిపూడి: మండలంలోని అంకేపల్లి గ్రామ సచివాలయంలో గ్రామవ్యవసాయ సహాయకునిగా విధులు నిర్వహిస్తున్న ఈర్ల చినబాబుపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటన అంకేపల్లి గంగమ్మ గుడికి సమీపంలో బుధవారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాలు మేరకు... మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఈర్ల చినబాబు మండలంలోని అంకేపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకునిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తన సొంత గ్రామమైన కూచిపూడి నుంచి ద్విచక్రవాహనంపై విధులు నిర్వహించేందుకు అంకేపల్లి సచివాలయానికి బయలుదేరాడు. అంకేపల్లి గంగమ్మ దేవాలయం సమీపంలోకి రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు ధరించి అటకాయించి ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో చినబాబు కుడికంటికి తీవ్ర గాయమైంది. శరీరంపై రక్త గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించినట్లు బంధువులు తెలిపారు.
దిగజారిన కనిష్ట ధరలు
టంగుటూరు: పొగాకు కనిష్ట ధరలు దిగజారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వేలం ప్రారంభంలో కనిష్ట ధర రూ.260 వరకు పలికింది. అయితే గత వారం రోజులుగా ధర తగ్గుతూ బుధవారం కనిష్ట ధర రూ.230 పలికింది. పొగాకు కంపెనీల ప్రతినిధులు బోర్డు అధికారులతో కుమ్మకై ్క అన్ని కంపెనీలు వేలం పాల్గొనడం లేదు. దీంతో వేలంలో పాల్గొన్న కంపెనీలు ధరలను తగ్గించేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పొలం, బ్యార్నీ కౌలు, కూలీ ధరలు పెరగడంతో సాగు ఖర్చు రెట్టిపయింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కంటే మెరుగైన ధరలు వస్తేనే పొగాకు రైతులు గట్టెక్కేది. కానీ వేలం ప్రారంభం నుంచి ధరల్లో పెరుగుదల లేకపోగా ఉన్న ధరలను తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు.
పొగాకు బోర్డు ఉన్నతాధికారులు వారానికి ఒక సారి వచ్చి వేలం కేంద్రాన్ని, వేలం ప్రక్రియను తూతూమంత్రంగా పరిశీలించి వెళుతున్నారే తప్ప ధరలపై శ్రద్ధ చూపడం లేదని రైతులు వాపోతున్నారు. బుధవారం వేలం కేంద్రానికి చింతలపాలెం, దావగూడూరు గ్రామాలకు చెందిన రైతులు 521 బేళ్లను వేలానికి తీసుకురాగా 371 బేళ్లను కొనుగోలు చేసి 150 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.230, సరాసరి రూ.254.95గా నమోదైంది. వేలంలో 19 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
ఆందోళన చెందుతున్న పొగాకు రైతులు
అధిక సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్న బేళ్లు


