గంజాయి విక్రేతల అరెస్టు
మార్కాపురం: మార్కాపురం పట్టణ శివారులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి సుమారు 2 కిలోల గంజాయి, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. గంజాయి విక్రయాన్ని కట్టడి చేసేందుకు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సీఐకి అందిన సమాచారం మేరకు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మలిపెద్ది ప్రభావతి, పట్టణ ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్‌రావు, రూరల్ ఎస్సై అంకమరావుతో కూడిన బృందంతో ఎస్టేట్ ఏరియాలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసి అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల వద్ద ప్లాస్టిక్ కవర్‌లో 2 కిలోల గంజాయి లభ్యమైంది. పట్టణంలోని జగదీశ్వరి థియేటర్ వద్ద నివాసముండే సుంకర మధు, వెంకట గోపీనాధ్ అరకు ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి మార్కాపురం తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వారు తన మిత్రులైన పట్టణంలోని కరెంటు ఆఫీసు వెనుక ఉండే పాడి తిరుమలయ్య, మీనా మసీదు వద్ద ఉండే ఎస్‌కే ఇమ్రాన్‌కు గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు. ఈ ముఠా గంజాయి రవాణా చేసేందుకు ఉపయోగించిన బైకును కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
త్వరలోనే మరికొందరు గంజాయి విక్రేతలు, వినియోగదారులను అరెస్టు చేస్తామని చెప్పారు. బెట్టింగ్ యాప్‌ల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ బెట్టింగ్‌తో ఆర్థికంగా చితికిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను తరచూ పరిశీలించాలని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.
ముగ్గురు నిందితుల నుంచి 2 కేజీ గంజాయి, బైకు స్వాధీనం
వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు


