రైతులను మోసగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఒంగోలు టౌన్: రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా మద్దతు ధరలను ప్రకటించి వారిని మోసగించడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్రంలో గత సంవత్సరం మిర్చి క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.24 వేల ధర లభించగా, ఈ ఏడాది కేవలం రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే ధర వచ్చిందని, దీని వలన రైతులు చాలా నష్టపోతున్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.11,780 ప్రకటించడం దుర్మార్గం అన్నారు. మిర్చి రైతుకు రూ.5 వేల బోనస్ ప్రకటించి స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాని డిమాండ్ చేశారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1500 మాత్రమే బోనస్ ప్రకటించిందన్నారు. దేశంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు బోనస్ ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదని, కౌలు రైతు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన చట్టాలను అమలు చేయడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ వస్తున్నా పంటల బీమా అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రుణపరిమితి వంటి రైతు సంక్షేమ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల వలన పొగాకు రైతులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. నల్లబర్లీ గత ఏడాది క్వింటా రూ.18 వేలు ఉండగా ఈ ఏడాది రూ.3 వేలకే కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో కోకో సాగును ప్రోత్సహించిన కంపెనీలు ఊరగాయ పెట్టుకోమంటూ ఎగతాళి చేస్తున్నాయని అన్నారు. పసుపు ధర కూడా పతనమైందని, మొక్కజొన్న, వరికి గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బాల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు


