పశ్చిమ ప్రకాశంలో వర్షం
మార్కాపురం: డివిజన్ కేంద్రం మార్కాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి గాలీవాన, ఉరుములు మొరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 7.30 గంటల వరకు కురుస్తున్న వర్షంతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. పట్టణంతో పాటు వేములకోట, తిప్పాయపాలెం, నికరంపల్లి, దరిమడుగు, బోడపాడు, రాయవరం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో పలువురు వ్వాపారులు ఇబ్బంది పడ్డారు. వారం రోజుల నుంచి రోజూ సుమారు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ తీవ్ర ఎండ వేడికి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్ల బడటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 7.30 గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు.
● కూలిన చెట్లు, రేకుల షెడ్లు
పొన్నలూరు: మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పొన్నలూరు, వెంకుపాలెం, రాజోలుపాడు, కె.అగ్రహారంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. పొన్నలూరులో పొగాకు బ్యారన్‌ల రేకుల పైకప్పు కూలిపోయాయి. వర్షానికి మండలంలో ప్రధానంగా మిరప పంట కోత దశలో ఉండటంతో కొంతమేర నష్టం చేకూరే అవకాశం ఉందని, ముదురు పొగాకు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
పీసీపల్లి: మండల కేంద్రం పీసీపల్లిలో గాలీవాన బీభత్సం సృష్టించింది. వడగండ్లతో మహావృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. హైస్కూల్ ఎదురుగా ఉన్న చెట్టు పడిపోవడంతో ప్రహరీ కూలిపోయింది. స్థానిక ఎస్సీ హాస్టల్లో రేకులు లేచిపోయాయి. ప్రభుత్వాస్పత్రిలో దిరిసిమ్మ చెట్లు నేలమట్టమయ్యాయి. పశు వైద్య కేంద్రంలో శతాబ్దపు దిరిసిమ్మ చెట్టు కూలిపోయింది. విద్యుత్ వైర్లు కూడా తెగిపడి కరెంట్ నిలిచిపోయింది. అమ్మవారిపల్లిలో దేవుళ్ల బ్రహ్మయ్య ఇంటి రేకులు లేచిపోయి అందులో ఉన్న పొగాకు పూర్తిస్థాయిగా తడిచింది. కొత్తపల్లికి చెందిన గల్లా నర్సింగ్ ఇంటి రేకులు లేచి పొగాకు పూర్తిగా తడిసి ముద్దయింది. మిరపకాయలు కూడా తడిసి ముద్దయ్యాయి.
పశ్చిమ ప్రకాశంలో వర్షం
పశ్చిమ ప్రకాశంలో వర్షం
పశ్చిమ ప్రకాశంలో వర్షం


