రామతీర్థంలో ఆధ్యాత్మిక శోభ
● గంగమ్మ తిరునాళ్లకు పోటెత్తిన జనం
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థంలో వెలసిన గంగా బాలత్రిపుర సుందరీ సమేత మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానంలోని గంగమ్మ తల్లి తిరునాళ్లు సందర్భంగా శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలు, జైంట్‌వీల్, ప్రభలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చీమకుర్తి నుంచి వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఒక్కో ప్రభ, చీమకుర్తి రూరల్ నుంచి రాజుపాలెం, కంభంపాడు, బూదవాడ నుంచి మరో మూడు ప్రభలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సామాజిక సత్రంలో భక్తులకు అన్నదానం కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యాలు వివిధ సంస్థలు, సంఘాల ప్రతినిధులు నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో 7 వేల మందికి అన్నదానం చేశారు. చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, క్రిస్టపాటి శేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఓబులరెడ్డి పాల్గొన్నారు.
రామతీర్థంలో ఆధ్యాత్మిక శోభ


