కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..!
పామూరు: కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానంతో నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన పామూరులో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...స్థానిక ప్రశాంతినగర్‌లో యాసారపు రమేష్ బేల్దారీ పనులు చేసుకుంటూ భార్య మార్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. రమేష్ బేల్దారీ పనులు చేస్తుండగా, మార్తమ్మ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మార్తమ్మపై భర్త రమేష్‌కు అనుమానం. దీంతో ఆమైపె ద్వేషం పెంచుకొని నిత్యం గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మార్తమ్మ నిద్రిస్తున్న సమయంలో భర్త రమేష్ రోకలిబండంతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. సమీపంలోని వారు గమనించి క్షతగాత్రురాలు మార్తమ్మను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా..అప్పటికే మార్తమ్మ(30) మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, కనిగిరి సీఐ షేక్.ఖాజావళి పరిశీలించారు. ఘటనపై ఎస్సై టి.కిషోర్‌బాబుతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఖాజావళి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
భార్యపై రోకలిబండతో దాడి చేసి హత్య
అనుమానంతో భార్యకు నిత్యం వేధింపులు


