భూ కబ్జాల వెనక పెద్దల హస్తం | - | Sakshi
Sakshi News home page

భూ కబ్జాల వెనక పెద్దల హస్తం

Apr 15 2025 1:39 AM | Updated on Apr 15 2025 1:42 AM

భూ కబ్జాల వెనక పెద్దల హస్తం

భూ కబ్జాల వెనక పెద్దల హస్తం

ముక్తినూతలపాడులో కబ్జాకు గురైన భూములు పరిశీలించిన వైఎస్సార్‌ సీపీ బృందం

సిట్‌ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎమ్మెల్యే దామచర్లకు హితవు

కూటమి పాలనలో 9 నెలల్లోనే ప్రభుత్వ భూముల కబ్జాలు

ఒంగోలు టౌన్‌: నగర పరిధిలోని రెండో డివిజన్‌ సర్వే నంబర్‌ 17లో 5.60 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తుల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వస్తున్న కథనాలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ స్పందించాలని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ నాయకుల బృందం సోమవారం కబ్జాకు గురైన భూములు పరిశీలించారు. అనంతరం ముక్తినూతలపాడు గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కఠారి శంకర్‌ మాట్లాడుతూ సర్వే నంబర్‌ 17లో మొత్తం 21.17 ఎకరాల కుంట భూమి ఉందని మీ భూమి పోర్టల్‌ కూడా చూపిస్తుందని తెలిపారు. అయితే కూటమి పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పట్టపగలే భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి ఆక్రమించుకున్నారని, ఈ విషయంపై పత్రికలలో వార్తలు వచ్చినా రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సుమారు రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. ఈ కబ్జా వెనక పెద్దల హస్తం ఉండటం వల్లే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తక్షణమే రెవెన్యూ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. నగర కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ గతంలో భూ కబ్జాలు జరిగాయని, సిట్‌ వేస్తామని గొప్పలు చెప్పిన పాలకులు ఇప్పుడీ కబ్జాలపై కూడా సిట్‌ వేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. గతంలో ఈ భూమిని పేదలకు పంపిణీ చేయాలని జాన్‌ ప్రకాశ్‌ కోర్టులో కేసు వేశారని, కోర్టులో ఉన్న భూమిని కబ్జా చేశారని చెప్పారు. 1929లో ఒక రిటైర్డ్‌ ఆర్మీ సైనికుడికి 5.60 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చినట్లు కబ్జాదారులు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు మాత్రం ఇప్పటి వరకు సదరు భూమిని ఎవరికీ ఇవ్వలేదని చెబుతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు వెంటనే భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు ఎక్కువైపోయాయని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్‌ ప్రవీణ్‌ కుమార్‌, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కో ఆప్షన్‌ మెంబర్‌ శ్యాం సాగర్‌, నాయకులు దాసరి కరుణాకర్‌, నాగూర్‌, షాన్‌బాషా, మూసా, సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి, కొక్కిలిగడ్డ వెంకటేశ్వర్లు, భువనేశ్వరి, పిగిలి శ్రీనివాసరావు, ఆనం శ్రీనివాసరెడ్డి, కాలేషా, ఎర్రజర్ల రమేష్‌, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరో గ్రంథాలయ ఉద్యమానికి సన్నద్ధం

ఒంగోలు మెట్రో: మరో గ్రంథాలయ ఉద్యమాన్ని మే ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఒంగోలులో సోమవారం ఉదయం పది గంటలకు ఎన్జీవో హోం సమీపంలోని దీప్‌ ట్రస్ట్‌ భవనంలో గ్రంథాలయ ఉద్యమ సన్నాహక సమావేశం నిర్వహించారు. భాష, చదువులకు సంబంధించి, పిల్లలు, యువతకు సంబంధించిన అంశాలపై గ్రంథాలయ ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. వివిధ సామాజిక సమస్యలపై ప్రచారం చేయాలని తీర్మానించారు. ఒంగోలు కేంద్రంగా నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న పలు సంస్థల అధిపతుల ఐక్య కార్యాచరణ కోసం ఐక్యవేదిక ఏర్పాటు విషయాన్ని చర్చిస్తారన్నారు. రంగభూమి కళాకారుల సంఘ అధ్యక్షుడు అంగలకుర్తి ప్రసాద్‌, బొమ్మరిల్లు వ్యవస్థాపకుడు కథా రచయిత పీ రాజ్యలక్ష్మి, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం, అధ్యక్షురాలు టీ అరుణ, మరో గ్రంథాలయ ఉద్యమ కార్యదర్శి కాంతి నల్లూరి, డాక్టర్‌ కొర్రపాటి సుధాకర్‌, ప్రముఖ విద్యావేత్త సీఏ ప్రసాద్‌, జానుడి డైరెక్టర్‌ ప్రముఖ రచయిత డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌, దీప్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు సత్యనారాయణమూర్తి, దంత వైద్యులు డాక్టర్‌ శంకర్రావు, కవయిత్రి బీరం అరుణ పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమం ఒంగోలులో నిర్వహించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు స్ఫూర్తిగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement