రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గిద్దలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముండ్లపాడు రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం రామాపురానికి చెందిన ఖాదర్‌వలి(60) గిద్దలూరుకు వచ్చి పని ముగించుకుని తిరిగి స్వగ్రామం వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఖాదర్‌వలి తలకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హత్యపై
ముమ్మర విచారణ
పామూరు: స్థానిక ప్రశాంతి నగర్‌లో ఆదివారం యాసారపు మార్తమ్మను ఆమె భర్త యాసారపు రమేష్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోమవారం సీఐ ఎం భీమానాయక్ విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఘటన జరిగిన సమయంలో ఉన్న వారితో చర్చించారు. ఈసందర్భగా సీఐ మాట్లాడుతూ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం, భార్యాబిడ్డలు ఛిన్నాభిన్నమవుతున్నారన్నారు. సీఐ వెంట వీఆర్‌ఓ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రావెల్ ట్రాక్టర్లు స్వాధీనం
గిద్దలూరు రూరల్: పట్టణంలో రైల్వేస్టేషన్ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న మూడు గ్రావెల్ ట్రాక్టర్లను స్థానిక తహశీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డి సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా కొందరు వ్యక్తులు మండలంలోని కొండ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి గ్రావెల్‌ను ట్రాక్టర్ల ద్వారా విక్రయించేందుకు వెళుతున్న సమయంలో తహశీల్దార్ అడ్డుకుని రెవెన్యూ కార్యాలయం ఆవరణకు ట్రాక్టర్లను తరలించారు. పట్టుబడిన ట్రాక్టర్లు ఎవరివి అనేది తెలియదని, వాటికి జరిమానాలు విధించి మట్టితోలకాల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వం పది నెలల పాలనలోనే అట్టర్ ఫెయిలైందని కాంగ్రెస్ నాయకుడు తులసీరెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిహంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. మెగా డీఎస్సీ పేరుతో 16 వేల టీచర్లకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని తొలి సంతకం పెట్టి..10 నెలలు దాటినా ఇంత వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని, కనీస అవగాహనకు రాలేదని ఘాటుగా విమర్శించారు. యువతకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందన్నారు. పార్టీ నాయకులు దేవరపల్లి సుబ్బారెడ్డి, వేల్పుల రాజశేఖర్, బలసాని కోటేశ్వరరావు, తాని గుండాల తిరుపతిరెడ్డి , సంగటి మల్లికార్జునరెడ్డి, పిల్లి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
వంద ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా
కురిచేడు: మండలంలోని గంగదొనకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు 800 ఎకరాలు కేటాయించిన విషయం విదితమే. అయితే దాని పక్కనే ఉన్న 100 ఎకరాల ఏడబ్ల్యూ భూమిని దున్నించి చదును చేశారు. దానిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు అధికార పార్టీ నాయకులు, మరికొందరు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో ఆక్రమణకు తెరతీసినట్లు సమాచారం. కలెక్టర్ చొరవ తీసుకుని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గంగదొనకొండ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


