జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు ప్రారంభం
మార్కాపురం: స్థానిక లక్ష్మీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జాతీయ స్థాయి ఎడ్ల పోటీలను ఎస్‌వీకేపీ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈపోటీలు రెండు రోజులపాటు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శుక్రవారం జరిగిన ఎడ్ల పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పది జతలకు పైగా ఎడ్లు వచ్చాయి. ఒంగోలు జాతి ఎడ్ల పోటీల్లో బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన ఎ శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి, ఆళ్లగడ్డకు చెందిన జీ నరసింహారెడ్డిల ఎడ్ల జత 4760.10 అడుగులు లాగి రూ.60 వేల బహుమతిని సాధించుకుంది. ద్వితీయ బహుమతిని నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బీ నారాయణరెడ్డి ఎడ్లజత, బేస్తవారిపేట ఎంపీపీ వేగినాటి ఓసురారెడ్డి ఎడ్ల జత 4750 అడుగులు లాగి రూ.35 వేల నగదు బహుమతి సాధించాయి. ఇంకా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంకట సాయి భవిత్ రెడ్డి, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన పూజిత రెడ్డి ఎడ్ల జతలు కూడా బహుమతులు గెలుచుకున్నాయి. పోటీలను తిలకించేందుకు మార్కాపురం పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


