రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు
సిరిసిల్ల: రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలకు జిల్లా బాలబాలికల జట్లు గురువారం వికారాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. వికారాబాద్‌లో జరిగే 74వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొననున్నాయి. బాలికల జట్టుకు కామాక్షి, బాలుర జట్టుకు భానుప్రకాశ్ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలికల జట్టు కోచ్‌గా శ్రీలత, మేనేజర్‌గా సన వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు కబడ్డీ అసోసియేషన్ సిరిసిల్ల మండల అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కార్యదర్శి మదన్, సింగారం తిరుపతి శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్‌ఎస్ పాపాలను కాంగ్రెస్ కడిగేస్తోంది
● వస్త్రోత్పత్తి అనుబంధ సంఘాల ఐక్యవేదిక
సిరిసిల్లకల్చరల్: గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని చేనేత వస్త్రపరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక స్పష్టం చేసింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమకు బకాయలు పడ్డ బతుకమ్మ చీరల బిల్లులను కాంగ్రెస్ చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు 20శాతం చెల్లింపులతో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ వైఖరి ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సొంతంగా పవర్‌లూమ్స్ లేకపోయినా ఐదు మ్యాక్స్ సొసైటీల ద్వారా ఉత్పత్తి చేసిన చీరల బిల్లులు రూ.3కోట్ల 45లక్షల 83వేల బకాయలు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం నిజం కాదా అని అడిగారు. బకాయిలు విడుదలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వేదిక ప్రతినిధులు అంకారపు రవి, దూడం శంకర్, బూట్ల నవీన్, బండారి అశోక్, నల్ల ప్రదీప్, శ్రీగాద మైసయ్య పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి
సిరిసిల్లకల్చరల్: జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. శివనగర్‌లోని ఏఎన్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందనేందుకు తానే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. పట్టభద్రులను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, పూర్వ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకుడు ఆడెపు రవీందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మ్యాన రాంప్రసాద్, పట్టణాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
8న మెగా లోక్ అదాలత్
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం మార్చి 8న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో గురువారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తులు, అన్ని మండలాల పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజీమార్గాన్ని అనుసరించి పరిష్కరించుకోదగిన కేసుల విషయంలో కక్షిదారులను సమన్వయం చేయాలని సూచించారు. గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. కక్షిదారులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, న్యాయమూర్తులు లక్ష్మణాచారి, ప్రవీణ్, జ్యోతిర్మయి, సృజన, మేఘన, అదనపు ఎస్పీ చంద్రయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు
Comments
Please login to add a commentAdd a comment