వరికి ఊస..రైతుకు బెంగ
వరిపంట ఊస తిరుగుతుంది
వరిపంటకు ఎన్ని మందులు వాడిన చేతికొచ్చే సమయంలో ఊస తిరిగి తాలుగా మారుతోంది. వరి పంటకు 10 కర్రలు ఉంటే సగం కర్రలు తాలుగా మారుతుంది. ఎలాంటి మందులో వాడాలో తెలియక ఫర్టిలైజర్ దుకాణ దారులు ఇచ్చినవే వాడుతున్నాం. అవి సరిగా పనిచేయడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తే బాగుండు.
– జంగం గంగరాజు, నాంపల్లి
అవగాహన కల్పించాం
వాతావరణంలో మార్పులతో మార్చి మొదటి వారం, రెండో వారం ఉదయం, రాత్రి, చలి, మధ్యాహ్నం ఎండ ఉంటుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పంటపై శిలీంద్రం ఉధృతి పెరిగింది. వరిపంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– సాయికిరణ్,
మండల వ్యవసాయాధికారి, వేములవాడ
● పంట సాగు నుంచి అన్నదాతకు కష్టాలే..
● తొలుత సాగునీరు అందక ఎండిన పంటలు
● ఇటీవల వడగండ్లతో నేలవాలిన వైనం
● నేడు ఊసతో తాలుగా మారుతున్న వరి
వేములవాడఅర్బన్: వరి సాగు చేసిన రైతులను ఈ సీజన్‌లో కష్టాలు వెన్నంటే ఉంటున్నాయి. తొలుత సాగునీరు అందక పంట ఎండిపోగా.. ఇటీవల వడగండ్లతో మరికొంత పంటనష్టం ఏర్పడింది. ఇప్పుడు ఊస తెగులు ఆశిస్తుండడంతో చివరి దశలో పంట తాలుగా మారుతోంది. ఊస ఆశిస్తుండడంతో సగం పంట కూడా చేతికొస్తుందో.. లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడిపై భయాందోళన
జిల్లాలో రైతులు 1,49,366 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. అయితే నీరందక దాదాపు 419 ఎకరాల్లో పంట ఎండిపోయింది. కొందరు రైతులు పశువులకు మేతగా వదిలేశారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో 1875 ఎకరాల్లో పంట నేలవాలింది. అన్ని తట్టుకొని మిగిలిన పంట చేతికొస్తుందని ఆశపడ్డ రైతులకు ఊస తెగులు భయాందోళనకు గురిచేస్తుంది. ఊస తెగులు ఆశిస్తుండడంతో వరి పంట తాలుగా మారిపోతుంది. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ఇలా దెబ్బమీద దెబ్బ పడుతుండడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కల్పించని అధికారులు
జిల్లాలోని 13 మండలాలకు వ్యవసాయాధికారులు ఉన్నారు. వీరు మండలాల్లో పర్యటించి ఏ భూమిలో ఏ పంటలు వేసుకోవాలి, ఏ సమయంలో ఏయే మందులు వేయాలని అనే విషయాలను రైతులకు వివరించాలి. కానీ ఒక్క మండలంలో కూడా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. పంటలకు ఎలాంటి మందులు వేయాలో తెలియక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు చెప్పిందే సలహా.. ఇచ్చిందే మందు
గతంలో వరి పంటలను పరిశీలించి ఫర్టిలైజర్ దుకాణాదారులు, కంపెనీల ఏజెంట్లు పురుగుమందులను ఇచ్చేవారు. అంతేకాకుండా ఒక రైతుపొలంలో పిచికారీ చేసి పనిచేస్తుందా.. లేదా.. అని పరిశీలించిన తర్వాత ఆ క్రిమిసంహారక మందును రైతులకు విక్రయించేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. రైతులు ఫర్టిలైజర్ షాపులకు వెళ్తే.. అక్కడి వ్యాపారి చెప్పిందే సలహా.. ఇచ్చిందే మందుగా మారింది. కొన్ని సందర్భాల్లో ఆ క్రిమిసంహారక మందులు పనిచేయక పంటనష్టం జరుగుతుంది.
జిల్లాలో వరిపంట వివరాలు
పంటలు ఎకరాలు
వరి 1,49,366
ఎండిన పంటలు 419
వడగండ్లతో నష్టం 1,875
పెట్టుబడి కష్టమే..
వరిపంట ఊస తిరిగి తాలుగా మారుతోంది. పెట్టుబడి రావడం కష్టంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే చేతికొచ్చే వరకు నమ్మకం లేదు. అధికారులు పంటలకు ఎప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలపడం లేదు.
– మానుక కొమురయ్య, తిప్పాపూర్
వరికి ఊస..రైతుకు బెంగ
వరికి ఊస..రైతుకు బెంగ
వరికి ఊస..రైతుకు బెంగ


