గుడి.. బడిని మరిచారు
● పరిహారం రాక అద్దె భవనంలోనే స్కూల్ ● అద్దె చెల్లిస్తున్న మాజీ ప్రజాప్రతినిధి ● మిడ్‌మానేరు ముంపు గ్రామంలో అద్దె భవనంలోనే స్కూల్ ● పక్కా భవనం లేక ఇబ్బందులు
వేములవాడఅర్బన్: మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం అందించినా అధికారులు.. గుడి, బడిని మరిచారు. మధ్యమానేరు నిర్వాసిత గ్రామం వేములవాడ మండలం ఆరెపల్లిలోని గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాల ముంపునకు గురైంది. అప్పటి అధికారులు పాఠశాలకు నోటిఫికేషన్ అవార్డు చేశారు. కానీ పరిహారం అందలేదు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పాఠశాలకు పక్కా భవనం నిర్మించలేదు. బడికి, గుడికి పరిహారం అందక పక్కా భవనాలు కరువయ్యాయి.
అద్దె చెల్లిస్తున్న మాజీ ప్రజాప్రతినిధి
గ్రామంలో పాఠశాల మూతబడితే మళ్లీ తెరుచుకోదనే ఉద్దేశంతో మాజీ సర్పంచ్ ఇటుకల నవీనరాజు అద్దె ఇంటిని తీసుకున్నారు. స్కూల్ నిర్వహణకు ఇంటి అద్దెను మాజీ సర్పంచ్ ఆరేళ్లుగా భరిస్తున్నారు. ప్రతీ నెల రూ.2వేల చొప్పున గత ఆరేళ్లుగా చెల్లిస్తూ స్కూల్ నిర్వహణకు సహకరిస్తున్నారు. ముంపునకు గురైన ప్రభుత్వ పాఠశాలకు పరిహారం అందించి, అన్ని హంగులతో నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేములవాడ మండలంలోని మిడ్‌మానేరు ముంపు గ్రామాలైన సంకెపల్లి, అనుపురం, కొడుముంజ, రుద్రవరం, చింతల్‌ఠాణా, చీర్లవంచ, శాభాష్‌పల్లి గ్రా మాల్లో ముంపునకు గురైన పాఠశాలల స్థానంలో నూతనంగా స్కూల్ భవనాలు నిర్మించారు. కానీ ఆరెపల్లిలో మాత్రం స్కూల్ భవనం గురించి పట్టించుకోవడం లేదు.
ఆలయాలకు పరిహారం అందలేదు
ఆరెపల్లి గ్రామంలోని శ్రీహనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయం ముంపునకు గురైంది. అప్పటి అధికారులు నోటిఫికేషన్ అవార్డు చేసి వదిలేశారు. నష్టపరిహారం మాత్రం అందించలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అప్పటి ప్రభుత్వంలో గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని గ్రామస్తులు చందాలు వేసుకొని హనుమాన్, పోచమ్మ ఆలయాలు నిర్మించుకున్నారు. ఇప్పటికైనా ఆ ఆలయాల పరిహారం అందిస్తే ప్రస్తుత ఆలయాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
గుడి.. బడిని మరిచారు


