గుండారంలో తాగునీటి తండ్లాట
● రోడ్డెక్కిన తండావాసులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని ప్రజాపాలన పైలట్ గ్రామం గుండారం గ్రామపంచాయతీలో తాగునీటి తండ్లాట మొదలైంది. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. తమ తండాలో 15 రోజులుగా సుమారు 16 ఇండ్లకు తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరాజును వివరణ కోరగా కొన్ని రోజులుగా ఆ తండాలో తాగునీటి ఇబ్బంది ఉందన్నారు. అందుకోసం మిషన్ భగీరథ నీటికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్‌తో నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. సమస్య గురించి తెలుసుకొని ట్యాంకర్‌తో నీళ్లను అందిస్తామన్నారు. ట్యాంకర్‌తో నీళ్లను అందించకుండా శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొదావత్ రవీందర్‌నాయక్ మద్దతు తెలిపారు. మూడు రోజుల్లోగా నీటి సమస్య పరిష్కరించకపోతే మండల పరిషత్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


