ఆయిల్‌పామ్ వైపు మెట్ట రైతులు
● సాంప్రదాయ పంటలు వీడి నూతన సాగు
● రైతులకు కలిసొస్తున్న తోటలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంతం ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఆయిల్‌పామ్ సాగుతో లాభాల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు సాంప్రదాయ పంటలైన వరి, కూరగాయలు, పత్తి సాగు చేసిన రైతులు.. కొందరు కొత్తగా ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లారు. మండలంలోని ఇల్లంతకుంట, దాచారం, పెద్దలింగాపూర్, పొత్తూరు, గాలిపల్లి, వల్లంపట్ల, రేపాక గ్రామాల పరిధిలో 320 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు.
ఎకరానికి 50 మొక్కలు
ఇల్లంతకుంట మండలంలోని దాదాపు 320 ఎకరాలలో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేస్తున్నారు. ఒక ఎకరంలో 50 మొక్కలు నాటుతారు. ఒక మొక్క ధర రూ.193 ఉండగా రైతు చెల్లించేది రూ.20 మాత్రమే. 14 నెలల వయసు ఉన్న ఆయిల్‌పామ్ మొక్కలు రైతులకు ఉద్యానశాఖ అధికారులు సరఫరా చేస్తారు. మొక్క నాలుగేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. మూడేళ్ల వరకు ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం కూడా ఉంది. పంట విత్తినప్పటి నుంచి నాలుగేళ్ల వరకు ఎరువుల కోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎకరానికి ఏటా రూ.4.200 చెల్లిస్తారు. పంటకు డ్రిప్ సిస్టం ద్వారా సాగునీటిని అందించాల్సి ఉంటుంది. పంటకు డ్రిప్ పద్ధతి కోసం అవసరమైన పైపులను ఉద్యానశాఖ సబ్సిడీ రుణం మంజూరు చేస్తుంది. డ్రిప్ కోసం ఇచ్చే రుణంలో ఓసీలు, బీసీలకు 80 శాతం చొప్పున, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఏడాది పొడగున నెలకోసారి పంట చేతికొస్తుంది. ఎకరానికి 8 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ధర ఒక టన్నుకు రూ.20,800 ఉంటుందని ఇల్లంతకుంట మండల ఉద్యానశాఖ క్లస్టర్ ఆఫీసర్ వినయ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఆయిల్‌పామ్‌ను అమ్ముకునే సౌలభ్యం ఉందని క్లస్టర్ అధికారి పేర్కొన్నారు. లాభసాటిగా ఉండడంతో రైతులు ఆయిల్‌పామ్ పంట వైపు మొగ్గు చూపుతున్నారు.
వరిసాగులో ఉన్నంత కష్టం లేదు
వరిసాగు కంటే ఆయిల్‌పామ్ సాగు సులభం. వరిసాగు కంటే తక్కువ నీరు అవసర పడుతుంది. సాగుచేసి నాలుగేళ్లు అవుతుంది. పంట రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. వరి సాగులో పడ్డంత కష్టం అవసరం లేదు.
– కడుదుల పద్మ, మహిళా రైతు, వల్లంపట్ల
ముందుకొస్తున్నారు
ఆయిల్‌పామ్ సాగులో ప్రభు త్వ ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండడంతో రైతులు ము ందుకొస్తున్నారు. మండలంలో 320 ఎకరాల్లో సాగవుతు ంది. వరికి అవసరమైనంత నీరు ఆయిల్‌పామ్‌లో అవసరం లేదు. పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. – సురేష్‌రెడ్డి,
మండల వ్యవసాయాధికారి, ఇల్లంతకుంట
ఆయిల్‌పామ్ వైపు మెట్ట రైతులు
ఆయిల్‌పామ్ వైపు మెట్ట రైతులు
ఆయిల్‌పామ్ వైపు మెట్ట రైతులు


