సురక్షితం.. సులభతరం
కొత్తపల్లి(కరీంనగర్): ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం నూతన పుంతలు తొక్కుతోంది. ఆ సాంకేతికతను ప్రజలకు అందించేందుకు నిపుణులు విశేషంగా ప్రయత్నిస్తున్నారు. యూపీఐ, ఆన్‌లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. అందులో భాగంగానే విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ సంస్థ యాప్‌ను రూపొందించింది. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు రెవెన్యూను సమకూర్చుకునేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. బిల్లుల చెల్లింపులో సమయం వృథా కావొద్దనే ఉద్దేశంతో టీజీఎన్‌పీడీఎల్ యాప్‌ను రూపొందించింది. కొన్నేళ్లుగా ఈ యాప్ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వినియోగదారులు ఆశించినస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రస్తుతం యాప్‌ను విద్యుత్ సంస్థ మరింతగా అభివృద్ధి చేసింది. నెలవారి విద్యుత్ బిల్లులు యాప్ ద్వారా సురక్షింగా, సౌకర్యవంతంగా, సులభంగా చెల్లించవచ్చు.
ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వర్సన్
యాప్‌ను ఆండ్రాయిడ్ వెర్షన్‌లో డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కలిగిన వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీజీఎన్పీడీసీఎల్ యాప్‌లోకి వెళ్లి వినియోగదారుని యూనిక్ సర్వీస్ నంబర్ నమోదు చేసుకొని బిల్లు చెల్లించవచ్చు. ఈ విధంగా ప్రతి నెల జెనరేట్ అయ్యే బిల్లు తాలుకు సమాచారం ఆటోమేటిక్ వస్తుంది. ఇది ఇంట్లోనే ఉండి కేవలం రెండునిమిషాల వ్యవధిలో చెల్లించవచ్చు. ఇప్పటి వరకు కరీంనగర్ సర్కిల్‌లో 1,27,339మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా రూ.1327.84 లక్షల చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా జరిగాయి.
ఆన్‌లైన్ చెల్లింపులు చేయండి
వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించి సమయం ఆదా చేసుకోవాలి. మెరుగైన విద్యుత్ అందించేందుకు సంస్థకు సహకరించాలి. వేసవిలో బయటకు రాకుండా, కూలైన్‌లో నిలబడి సమయం వృథా చేసుకోకుండా ఇంటి వద్దే సురక్షితంగా యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించండి.
– మేక రమేశ్‌బాబు, ఎస్‌ఈ కరీంనగర్ సర్కిల్
విద్యుత్‌శాఖలో డిజిటల్ చెల్లింపులు
సులభతరంగా ఆన్‌లైన్ చెల్లింపులు
టీజీఎన్‌పీడీసీఎల్ యాప్ రూపొందించిన సంస్థ
సమయం ఆదా.. ఎక్కడి నుంచైనా చెల్లించే అవకాశం
సురక్షితం.. సులభతరం


