రెండు దుకాణాల్లో చోరీ
హుజూరాబాద్: పట్టణంలో సోమవారం వేకువజామున రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ చౌరస్తాలో పోరండ్ల సమ్మయ్యకు చెందిన రాఘవేంద్ర కిరాణం, జనరల్ స్టోర్ షట్టర్ తాళాలు పగలగొట్టి కౌంటర్‌లోని రూ.25 వేల నగదును, సామగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే వరంగల్ రోడ్డులోని పరమేశ్వర ఎలక్ట్రికల్, వైండింగ్ దుకాణం షట్టర్ తాళాలు తీసి కౌంటర్‌లోని రూ.25 వేల నగదు, ఐదు తులాల వెండి దొంగిలించారు. కాగా దొంగలు వేకువజామున 2.30 గంటలకు రాఘవేంద్ర కిరాణం, 3.30 గంటలకు ఎలక్ట్రికల్ షాప్ తాళాలు తెరిచే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు.


