కేడీసీసీబీ దేశానికే రోడ్ మోడల్
● రైతుల పిల్లల విద్యకు ట్రంప్ ఎఫెక్ట్ ● కేంద్రం చేయూతనిస్తే రాష్ట్రం రిక్తహస్తం ● కేడీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ డీసీసీబీ దేశానికే రోడ్ మోడల్‌గా నిలుస్తోందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. మూతబడిన సహకార పెట్రోల్ బంకులను కేంద్రం తెరిపించి చేయూతనిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సహకార రంగానికి నష్టాన్ని తేనున్నాయని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కేడీసీసీబీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి, 2025–26 లక్ష్యాలను వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో రైతుల సంక్షేమార్థం ఎన్నో పనులు చేపట్టామని, రానున్న కాలంలో మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బతో రైతుల పిల్లలకు ఉన్నత విద్య అందించలేకపోతున్నామన్న బాధ ఉందని అన్నారు. 2005లో రూ.70 కోట్ల మేర నష్టాల్లో నడుస్తున్న డీసీసీబీ 2011లో డిజిటలైజేషన్, సుపరిపాలన, వ్యాపార కార్యకలాపాల వైవిధ్యం వంటి సంస్కరణల కారణంగా స్థూలంగా రూ. 2024–25 సంవత్సరంలో రూ.119కోట్లు లాభం సాధించిందని వివరించారు. కరీంనగర్ డీసీసీబీ దేశంలోని అనేక సహకార బ్యాంకులకు స్టడీ సెంటర్‌గా మారిందని, ఇతర బ్యాంకులు, పీఏసీఎస్‌లను సందర్శించి, పనితీరును అధ్యయనం చేసి, మంచి పద్ధతులను అవలంబించడానికి, కరీంనగర్‌ను దత్తత తీసుకోవాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. డిజిటలైజేషన్ నమూనా, సుపరిపాలన, వ్యాపార కార్యకలాపాల్లో అన్ని సహకార సంఘాలు మెరుగ్గా వ్యవహరించాయని అన్నారు. సిబ్బంది అందరిలో జవాబుదారీతనం ఉండేలా పనిని అప్పగించాలని బ్రాంచ్ మేనేజర్‌లకు తెలిపారు. నిరంతరం లాభాలు ఆర్జించేందుకు ప్రొత్సాహకాలు అందించాలని, ఉద్యోగులు చేసిన అభ్యర్థనపై డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులు అసాధారణంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. కేడీసీసీబీ వైస్ చైర్మన్ పి.రమేశ్, డైరెక్టర్లు మోహన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సీఈవో ఎన్.సత్యనారాయణరావు, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు హనుమంతరావు పాల్గొన్నారు.


