మూడు రోజుల్లో ఇద్దరు స్నేహితులు మృతి
● రంజాన్‌కు ముందు రోజు రోడ్డు ప్రమాదం ● హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స ● మూడు రోజుల క్రితం ఒకరు.. నేడు మరొకరు ● నారాయణపూర్‌లో విషాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వారిద్దరు చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు. ఒకరిని విడిచి మరొకరు ఉండ లేకపోయారు. మరణంలోనూ వీడలేమంటూ కలిసి వెళ్లిపోయారు. ఇటు కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చారు. స్నేహితులకు జ్ఞాపకంగా మిగిలిపోయారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితులు మృతిచెందడంతో ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో విషాదం అలుముకుంది. గత నెల 30వ తేదీన రంజాన్ పండుగ కోసం దుస్తులు తెచ్చుకునేందుకు మండలంలోని నారాయణపూర్‌కు చెందిన అవీజ్, అఫ్రోజ్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వీరు మండలంలోని హరిదాస్‌నగర్ శివారుకు చేరుకోవడంతోనే ఎదురుగా ఆటో రావడంతో ద్విచక్రవాహనం, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అవీజ్, అఫ్రోజ్‌లను మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అవీజ్‌ను హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం అఫ్రోజ్ మృతిచెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.


