భీమన్న గుడిలో రాజన్న దర్శనాలు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. జూన్ 15న ప్రారంభం కానున్నాయి. ప్రధాన ఆలయం మినహా మిగతా పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో భక్తులకు స్వామివారి దర్శనాల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. భీమన్నగుడిలో రాజన్నను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు ఆలయ ప్రాంగణ విస్తరణ, దర్శన మార్గాల అభివృద్ధి, అదనపు మండపాలు, పార్కింగ్ సదుపాయం, లైటింగ్ వ్యవస్థలతోపాటు పౌరాణికతకు హాని కలగకుండా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుంటున్నారు.
సీఎం పర్యటనతో పనుల్లో కదలిక
గత నవంబర్ 20న సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న గుడికి చేరుకుని రూ.47 కోట్లతో విస్తరణ పనులు చేపట్టేందుకు భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మగుండాన్ని తాత్కాళికంగా మూసివేసి పార్కింగ్ స్థలంలో షవర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భీమన్న ఆలయంలోనే కోడెమొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భీమన్నగుడికి ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారంతోపాటు మరో ద్వారాన్ని శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో చేపట్టనున్నారు. ఈనెల 15న దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు వేములవాడలో పర్యటించి పూర్తి ప్రణాళిక తయారు చేయనున్నారు. దీనిపై 16 దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో సమావేశమవుతారు. తుది ప్రణాళికపై సూచనలు, సలహాల కోసం ఈనెల 17న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు శృంగేరిపీఠానికి వెళ్తారు. అయితే ఇప్పటికే భీమన్నగుడిలో వివిధ ఏర్పాట్లు చేసేందుకు శృంగేరిపీఠాధిపతుల నుంచి రాజన్న ఆలయ అధికారులకు అనుమతిపత్రాలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు.
జూన్ 15 నుంచి ఆలయ విస్తరణ పనులు
ఉన్నతాధికారులతో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక సమావేశం
శృంగేరిమఠంలో కల్యాణాలు


