కడుపులు ఖాళీ
తేలని కూలి..
● మహిళాశక్తి చీరల బట్టకు ఖరారు కాని కూలిరేట్లు ● ఊసే లేని 10 శాతం యారన్ సబ్సిడీ ● వస్త్రోత్పత్తిదారులకు అందని దారం ● ‘వర్కర్ టు ఓనర్’కు మార్గదర్శకాలు కరువు ● మంత్రులపైనే నేతన్నల ఆశలు ● నేడు సిరిసిల్లకు మంత్రుల రాక
ఇతను కోడం బాలకృష్ణ. సిరిసిల్లలోని బీవైనగర్‌లో ఇందిర మహిళా శక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. మీటర్ బట్టకు ఎంత కూలి ఇస్తారో అధికారులు నిర్ధారించలేదు. నెల తిరిగే సరికి ఎన్ని డబ్బులు వస్తాయో అంచనా లేకుండానే పనిచేస్తున్నాడు.
ఇతను పెంటి తిరుపతి. మొన్నటి వరకు పాలిస్టర్ బట్ట నేసి నెలకు రూ.8వేల వరకు కూలి పొందాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్లు అయిన ఇందిర మహిళా శక్తి చీరల బట్ట నేస్తున్నాడు. ఎంత కూలి వస్తుందో తెలియకుండానే పనిచేస్తున్నాడు.
సిరిసిల్ల: నెలకు ఎంత కూలి వస్తుందో తెలియకుండానే సిరిసిల్ల నేతన్నలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్ ఇందిర మహిళాశక్తి చీరల బట్టకు కూలి ఖరా రు కాకపోవడంతో నేతన్నలు అయోమయానికి గురవుతున్నారు. నిజానికి అడ్డాపై పనికోసం నిరీ క్షించే కూలీ కూడా తనకు ఎంత కై కిలి కావాలో ముందే మాట్లాడుకుంటాడు. కానీ సిరిసిల్లలో వస్త్రోత్పత్తి చేస్తున్న నేతన్నలకు ఎంత కూలి ఇస్తారో అటు అధికారులు, ఇటు ఆసాములు స్పష్టం చేయడం లేదు. ఫలితంగా నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.
వంద సాంచాలపై చీరల ఉత్పత్తి
2024 ఆగస్టు 8న ఇందిర మహిళాశక్తి పేరిట.. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75కోట్లు. కానీ పూర్తి స్థాయిలో నూలు(దారం) సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి విడత బట్టకే నూలు అందక వస్త్రోత్పత్తి సాగడం లేదు. సిరిసిల్లలో 26వేల మరమగ్గాలు ఉండగా.. వంద సాంచాలపై మొక్కుబడిగా మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి అవుతోంది. మరోవైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగులు), వెప్ట్(అడ్డం కోముల పోగులు) నూలు అందుబాటులో లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను నేసే అవకాశం ఉంది. ఒక్కటి ఉంటే.. ఒక్కటి లేక.. వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతోంది. ఇందిర మహిళాశక్తి చీరల ఉత్పత్తికి అందని నూలుతో మరింత జాప్యం కానుంది. జౌళిశాఖ అధికారులు కూలిరేట్లను నిర్ధారించి గతంలో లాగే ప్రతీ మీటరుకు రూ.1.42, 10 శాతం యారన్ సబ్సిడీని వస్త్రపరిశ్రమలో శ్రమించే అన్ని రంగాల కార్మికులకు వర్తించేలా చర్యలు తీసుకుంటే చీరల వస్త్రోత్పత్తి వేగంగా సాగనుంది.
పది శాతం యారన్ సబ్సిడీ జాడేదీ..
నేతకార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించే లక్ష్యంతో 2019 నుంచి పది శాతం యారన్ సబ్సిడీ అందిస్తున్నారు. నేతకార్మికుడు ఉత్పత్తి చేసిన చీరల బట్ట ఆధారంగా ఒక్కో మీటరుకు అదనంగా రూ.1.42 కూలిని లెక్కించి చెల్లిస్తారు. ఇలా 2023లో నేసిన బతుకమ్మ చీరల బట్టకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు 6వేల మంది కార్మికులకు రూ.5కోట్ల మేరకు రావాల్సి ఉంది. ఈ డబ్బులు చెల్లించాలని నేతకార్మికులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సబ్సిడీ సొమ్ము కోసం రెండేళ్లుగా నేతన్నలు నిరీక్షిస్తున్నారు.
రూ.374 కోట్లతో వర్కర్ టు ఓనర్
సిరిసిల్లలో శ్రమించే నేతకార్మికులను ఓనర్లుగా మార్చేందుకు ‘వర్కర్ టు ఓనర్’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 అక్టోబర్ 11న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.374 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 88.03 ఎకరాల్లో ఇప్పటికే రూ.210 కోట్లు ఖర్చు చేసి రోడ్లు, 48 షెడ్లను నిర్మించారు. తొలివిడతగా 1104 మంది కార్మికులను యజమానులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఒక్కరికి కూడా సాంచాలు ఇవ్వలేదు. ఈ పథకానికి మార్గదర్శకాలు రాకపోవడంతో వర్కర్ టు ఓనర్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది అమలైతే.. వర్కర్లు ఓనర్లుగా మారి ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో ఆర్థికంగా స్థిరపడనున్నారు.
మంత్రులపైనే నేతన్నల ఆశలు
సిరిసిల్లకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ వస్తున్నారు. అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవానికి మంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి హోదాలో తుమ్మల నాగేశ్వర్‌రావు తొలిసారి సిరిసిల్లకు వస్తున్నారు. స్థానిక నేతన్నల ఆశలన్నీ మంత్రులపైనే ఉన్నాయి. వర్కర్ టు ఓనర్, 10 శాతం యారన్ సబ్సిడీ, మహిళాశక్తి చీరల బట్టకు కూలి రేట్ల నిర్ధారణ, వస్త్రోత్పత్తిదారులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్‌లో ఉన్న ‘సెస్’ కరెంట్ బిల్లుల సమస్య, బ్యాక్ బిల్లింగ్ ఇబ్బందులను పరిష్కరిస్తే.. సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభిస్తుంది. మంత్రుల పర్యటన నేపథ్యంలో నేతన్నల ఆశలన్నీ పాలకులపైనే ఉన్నాయి.
కడుపులు ఖాళీ
కడుపులు ఖాళీ
కడుపులు ఖాళీ


