రూ.13.67కోట్లకు తలనీలాల టెండర్
● రూ.5.34 కోట్లకు తగ్గిన రాజన్న ఆదాయం ● గత టెండర్ రూ.19.01 కోట్లు ● కమిషనర్‌కు నివేదిక సమర్పించిన ఆలయ అధికారులు ● టెండర్‌లో 33వ నిబంధనతో కాంట్రాక్టర్‌కు మేలు
వేములవాడ: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలు సేకరించుకునేందుకు రెండేళ్ల కాలపరిమితితో శుక్రవారం నాలుగోసారి టెండర్ నిర్వహించినట్లు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఇద్దరు, బహిరంగ వేలం పాటలో ఇద్దరు పాల్గొన్నారు. ఇందులో బహిరంగ వేలంపాటకు హాజరైన కళావతి ఎంటర్ ప్రైజేస్, నాగకుమారి ఎంటర్‌ప్రైజేస్ పాట పాడలేకపోయారు. తమిళనాడు కు చెందిన దొరై ఎంటర్ ప్రైజేస్, కేఎం ఎంటర్‌ప్రైజేస్‌లు ఆన్‌లైన్‌లో వేలంలో పాల్గొన్నారు. ఇందులో రూ.13.67 కోట్లకు దొరై ఎంటర్‌ప్రైజేస్ హెచ్చుపాటదారుడిగా నిలిచారు. దీనిపై ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. కమిషనర్ ఆదేశాలతో సదరు టెండర్ ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు.
గతంలో కంటే తక్కువ..
ఏప్రిల్ 11తో ముగిసే కాంట్రాక్ట్ వేలం గతంలో రూ.19.01కోట్లకు నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి వచ్చిన వేలంలో రూ.13.67కోట్లు హెచ్చుపాట వద్ద నిలిచిపోవడంతో రాజన్న ఆదాయానికి రూ.5.34 కోట్లు ఎసరు పడనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించుకుండా కాలయాపన చేయడం, ఆలయ అధికారులే తలనీలాలు పోగుచేయడం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పెషల్ పర్మిషన్ ఇచ్చేసి సదరు కాంట్రాక్టర్‌కు జూన్ వరకు చెల్లింపులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం జరిగిన తలనీలాల టెండర్‌పై కమిషనర్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సింది. ఒకవేళ రూ.13.67కోట్లు హెచ్చుపాటను ఒప్పుకుంటే రాజన్నకు రూ.5.34కోట్ల ఆదాయం తగ్గింది.
టెండర్‌లో 33వ నిబంధన ఇదీ..
ఈసారి టెండర్ నిర్వహించే క్రమంలో 33వ నిబంధనలో భాగంగా అధికారులు కాంట్రాక్టర్‌కు పలు సూచనలిచ్చారు. ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్న క్రమంలో ఎప్పుడైనా భీమేశ్వరాలయంలోకి దర్శనాలు కొనసాగించే అవకాశాలు ఉంటాయని.. ఈక్రమంలో రూ.13.67కోట్ల టెండర్ ప్రకారం ఏరోజు వరకు రాజన్న గుడి వద్ద తలనీలాల సేకరించారో అదే రోజు వరకు లెక్కలేసుకునే సౌలభ్యం కల్పించారు. ఒకవేళ భీమేశ్వరాలయంలో కల్యాణకట్ట ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తే సదరు కాంట్రాక్టర్‌కు ఇష్టమైతే ఉండొచ్చు లేదా తప్పుకోవచ్చనే నిబంధన పెట్టారు. దీంతో తలనీలాల టెండర్‌కు ఆదాయం తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సౌలభ్యాన్ని కాంట్రాక్టర్ తెలివిగా వినియోగించుకుని రాజన్న ఆదాయానికి గండికొట్టే ప్రమాదం లేకపోలేదని స్థానిక నాయీబ్రాహ్మణులు చర్చించుకుంటున్నారు.


