కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఆర్డీవో శేషాద్రి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలో 191 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ధాన్యం సేకరించకపోతే సమీపంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తామని తెలిపారు. వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్‌బేగం, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో..
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి, నారాయణపూర్, సింగారం, రాచర్లబొప్పాపూర్, గుండారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో శేషాద్రి ప్రారంభించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ సాబేరబేగం, వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బండారి బాల్‌రెడ్డి, సిరిపురం మహేందర్ ఉన్నారు.


