ఉపాధిహామీ పనులు ప్రారంభించండి
షాద్‌నగర్‌రూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా వ్యాప్తంగా వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య కోరారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఖాళీగా ఉంటున్నారన్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పనులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చేసిన ఉపాధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.86 వేల కోట్లను మాత్రమే కేటాయిందన్నారు. ఈ పరిమితిని పెంచాలన్నారు. ఉపాధి కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజూ రూ.700 ఇవ్వాలని, రెండు వందల రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. టెంట్లు, మంచినీళ్లు, గడ్డపార, పార, రవాణా సౌకర్యం తదితర ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, నాయకుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య
Comments
Please login to add a commentAdd a comment