పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈదురుగాలుల కారణంగా మాడ్గుల మండల పరిధిలోని గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయాధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారని.. ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దీనిపై స్పందించి రైతులకు పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–82 కాలువ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని.. వర్షాలు వచ్చిన సమయంలో కాల్వకు గండ్లు పడుతున్నాయని దీంతో రైతులకు నష్టం వాటిల్లితుందని చెప్పారు. వీటి కట్టడికి డైవెర్షన్‌లు, గేట్‌వాల్వ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. గత వర్షాకాలంలో తలకొండపల్లి మండల పరిధిలోని మహ్మద్‌ఖాన్‌చెరువు, పండుగాని చెరువులకు గండ్లు పడ్డాయని వర్షాకాలం లోపు ఆ చెరువులకు మరమత్తులు చేపట్టాలని కోరారు.
వార్డుల సంఖ్య పెంచాలి
ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
షాద్‌నగర్: జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్య పెంచాలని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి కోరారు. బుధవారం శాసన మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎదురు చూస్తున్న ఆశావహులు ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తుందని.. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడతారని భావించారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడంతో బిల్లును ఆపేశారనే అపోహ ప్రజల్లో ఉందన్నారు. ఎన్నికలకు ముందే జనాభాకు అనుగుణంగా వార్డులను పెంచాలని కోరారు. పంచాయతీ కార్మికుల వేతనాన్ని రూ.15వేలకు పెంచాలని కోరారు. కొత్త పంచాయతీలకు రెవెన్యూ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
చలో కలెక్టరేట్ పాదయాత్ర వాయిదా
బందోబస్తుకు పోలీసుల అనుమతి నిరాకరణ
యాచారం: ఫార్మాసిటీ భూ బాధితుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం గురువారం తలపెట్టిన చలో కలెక్టరేట్ పాదయాత్ర వాయిదా పడింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ పార్టీ నేతలు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుకు దరఖాస్తు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో అన్ని పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఇతర పోలీస్ సిబ్బందికి విధులు నిర్వహించాల్సి ఉంది. అందుకు గాను పాదయాత్ర బందోబస్తుకు పోలీస్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు వివరించారు. పోలీసుల అనుమతి లేకపోవడంతో చలో కలెక్టరేట్ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి
కేశంపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండల పరిధిలోని పోమాల్‌పల్లిలో మంజూరైన 25 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యతతో ప్రభుత్వం ఇచ్చిన మార్కింగ్‌ల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కిష్టయ్య, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ధనుంజయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమేశ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి


