ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పెంచేనా!
ఇబ్రహీంపట్నం: అక్రమ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు 25 శాతం రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల నుంచి ఫీజుల రూపేణ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.8.70 కోట్ల ఆదాయం సమకూరింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 14,053 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులుండగా సోమవారం నాటికి 1,918 దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు.
ఆరంభంలో ఇబ్బంది
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల చెల్లింపు అంశాలపై మొదట్లో అవగాహన లేకపోవడం, సాంకేతిక లోపాల కారణంగా మొదటి మూడు వారాల్లో దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. గడిచిన వారం రోజులగా ఫీజులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. వేలాది రూపాయల ఫీజులు, తక్కువ సమయం ఉండటం వలన చెల్లింపుదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఫీజులు చెల్లించాలా వద్దా..? ఇప్పుడు అవసరమా అనే మీమాంసలో పడ్డారు. ఇప్పటికే ఆయా ప్లాట్లు రెండుమూడు చేతులు మారడం ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులు మందకొడిగా సాగేందుకు ఓ కారణం. 25 శాతం ఫీజు రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ గడువును పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
ముగిసిన 25 శాతం సబ్సిడీ గడువు
ఫీజు చెల్లించిన 1,918 ప్లాట్ల దరఖాస్తుదారులు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.8.70 కోట్ల ఆదాయం


