ఆస్తి పన్ను వసూలులో ‘పట్నం’ రికార్డు
ఇబ్రహీంపట్నం: ఆస్తి పన్ను వసూలులో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ తొలిసారి రికార్డు సాధించింది. రూ.5 కోట్ల మార్కును దాటి ఔరా అనిపించింది. గ్రామ పంచాయతీ నుంచి 2013లో నగర పంచాయతీగా, 2018 మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. తగిన ఆదాయం సమకూరడంలేదు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పన్ను వసూలులో వెనుకబడింది. ఈ సారి అధికార యంత్రాంగం పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి అనుకూల ఫలితాలను సాధించింది.
పాత బకాయి రూ.7 కోట్లు
ప్రైవేట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారు 7,239 భవనాల నుంచి ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం వసూలు లక్ష్యం రూ.11.50 కోట్లు కాగా, అందులో రూ.7 కోట్లు పాత బకాయే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు 3,933 భవన యజమానుల నుంచి రూ.4 కోట్లు, 1,300 భవన యజమానుల నుంచి పాత బకాయి రూ.1.30 కోట్లను పుర అధికారులు రాబట్టగలిగారు. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో రూ.4.42 కోట్లు, 2022– 23లో రూ.4.06 కోట్లు, 2021– 22లో రూ.3.21 కోట్లను వసూలు చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31 నాటికి రూ.5 కోట్ల 30 లక్షలు వసూలు చేశారు.
రూ.5 కోట్లు రాబట్టిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ
లక్ష్యం చేరుకున్నాం
ప్రత్యేక దృష్టితో గడిచిన ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూలు లక్ష్యం నెరవేర్చాం. రూ.5.30 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించాం. సుమారు రూ.11.50 కోట్ల టార్గెట్‌లో రూ.7 కోట్లు పాత బకాయి ఉంది. అందులో ప్రభుత్వ సంస్థల బకాయే రూ.2.50 కోట్లు. ఈ సారి పాత బకాయి ఉన్న 1300 భవనాల యాజమానుల నుంచి రూ.1.30 కోట్లు వసూలు చేశాం. పాత బకాయి చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను తీసుకునే వీలుండదు. పేరుకుపోయిన బకాయిలన్నింటిని వసూలు చేయలేకపోయాం. – రవీంద్రసాగర్, కమిషనర్, ఇబ్రహీంపట్నం
ఆస్తి పన్ను వసూలులో ‘పట్నం’ రికార్డు


