నీళ్లు.. ఏవీ ఆనవాళ్లు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శేరిలింగంపల్లిలో ఫిబ్రవరి చివరి నాటికి 15.07 మీటర్ల లోతులో కన్పించిన నీటి ఆనవాళ్లు.. మార్చి చివరి నాటికి 23.12 మీటర్ల కిందికి పడిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 8.05 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్ర యించాల్సి వస్తోంది. బస్తీవాసుల బలహీనతను ట్యాంకర్ల యజమానులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. మినీ ట్యాంకర్(ట్రాక్టర్)కు రూ.1000, పెద్ద ట్యాంకర్ (డీసీఎం, లారీ)కు రూ.2,500 పైగా వసూలు చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ సహా మూసీ పరీవాహక ప్రాంతాల్లో బోర్లు వేసి యథేచ్ఛగా నీటి విక్రయాలు చేపడుతున్నారు. నగరానికి ఆనుకుని ఉన్న శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోనే కాదు.. శివారు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చేవెళ్లలో నెల రోజుల క్రితం 10.83 మీటర్ల లోతు నుంచి 12.00 మీటర్లలోతుకు, షాబాద్‌లో 12.01 మీటర్ల నుంచి 14.59 మీటర్లకు, తలకొండపల్లిలో 13.52 నుంచి 15.47 మీటర్ల లోతుకు జలమట్టం పడిపోయింది. మంచాల సహా యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లపై నీటిని తరలిస్తున్న దృశ్యాలు జిల్లాలో విరివిగా కన్పిస్తుండటాన్ని పరిశీలిస్తే.. మున్ముందు మరింత నీటి సంక్షోభం తప్పదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
మంచాలలో కరువు ఛాయలు
నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పటి శివారు ప్రాంతాలన్నీ ప్రస్తుతం నగరంలో అంతర్భాగమయ్యాయి. పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. చెరువులు, కుంటలు దాదాపు కనుమరగయ్యాయి. ఒకటి రెండు ఉన్నా..వాటి చుట్టూ భారీ నిర్మాణాలు, సీసీ రోడ్లతో పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారింది. ప్రతి 25 నుంచి 50 ఫీట్ల దూరంలో ఒక బోరు బావిని తవ్వుతుండటం, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూమిలోకి నీరు ఇంకకపోవడం, చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా లేకపోవడంతో భూగర్భంలోని నీరు పాతాళానికి పడిపోయింది. జనవరి చివర్లో కొంత ఆశాజనకంగా ఉన్న భూగర్భ జలాలు ఏప్రిల్ ప్రారంభం నాటికే పూర్తిగా కన్పించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకుపచ్చని పైరు.. నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. కొంత మంది రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పంట చేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచాల మండలం తిప్పాయిగూడలో ఇప్పటికే పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరకని పరి స్థితి. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఇప్పటి వరకు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
పడిపోతున్న జలమట్టం
ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మరింత తగ్గుముఖం
వట్టిపోతున్న బోరుబావులు
ఎండిపోతున్న పంటలు
తాగునీటికి తప్పని కటకట
నీళ్లు.. ఏవీ ఆనవాళ్లు?


