ట్రైకార్ బకాయి రుణాలు విడుదల చేయాలి
హుడాకాంప్లెక్స్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రైకార్ బకాయి రుణాలు రూ.219 కోట్లు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘాల జేఏసీ, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జర్పుల శివనాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ముడావత్ గోపీనాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సరూర్‌నగర్ మండల కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్ మాట్లాడుతూ.. గిరిజనులకు సంబంధించిన ట్రైకార్ 2019–2020, 2021లో 30వేల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం గుర్తించి రూ.219 కోట్లు కేటాయించిందని, క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ నిధులను నేటికీ విడుదల చేయకుండా గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే బకాయి రుణాలు విడుదల చేయాలని కోరారు. లబ్ధిదారులు ఇతర రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో రిజెక్ట్ అవుతోందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ట్రైకార్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే ఈ నెల 7న గిరిజనులతో మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాపురం రఘు, కార్యనిర్వాహక అధ్యక్షులు కండాల వెంకటేశ్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


