సుపారీ ఇచ్చే నా భర్తను చంపారు
మహేశ్వరం: భూ తగాదా వ్యవహారంలోనే తన భర్తను కారుతో ఢీకొట్టి హత మార్చారని మండలంలోని కల్వకోల్‌కు చెందిన కమల ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం పిల్లలు, బంధువులతో కలిసి ఆమె మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్య(52) కారు– బైక్ ఢీకొన్న ప్రమాదంలో బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే.
అన్ని కోణాల్లో విచారిస్తాం
మృతుడి భార్య కమల మాట్లాడుతూ.. తన భర్తను డ్రైవర్ ప్రశాంత్‌కి సుపారీ ఇచ్చి కారుతో వెనుక నుంచి ఢీకొట్టి దాయాదులు చంపారని ఆరోపించారు. భూ తగాదా విషయంలో కోర్టులో తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని తెలియడంతో దాయాదులు హత్యకు పూనుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోలీస్‌స్టేషన్ నుంచి కదిలేది లేదన్నారు. విచారణ చేస్తున్న ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని మార్చాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి చేరుకొని మృతుడి భార్య, పిల్లలు, బంధువులతో మాట్లాడారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని అన్ని కోణాల్లో విచారించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
దాయాదులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి ఆందోళన
డీసీపీ హామీతో సద్దుమణిగిన వ్యవహారం


