‘ఆపరేషన్ కగార్’ను ఆపేయండి
చేవెళ్ల: ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో ఆదివాసీలపై కొనసాగిస్తున్న దమనకాండను వెంటనే ఆపేయాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వై.మహేందర్ డిమాండ్ చేశారు. కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు తీరని అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరుతూ ఈ నెల 8న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ప్రజాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివాసి జాతిని అంతమొందించి, కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా బీజేపీ యత్నిస్తోందని, దీనిని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, ఏఐకేఎంఎస్ చేవెళ్ల డివిజన్ నాయకులు కె.జైపాల్, న్యూడెమోక్రసీ నాయకులు అశోక్, శ్రీకాంత్ ఉన్నారు.


