పరిహారాన్ని వినియోగించుకోండి
తాండూరు: దుద్యాల్ మండలంలో పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన హకీంపేట్, లగచర్ల గ్రామాల రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హకీంపేట్, లగచర్ల గ్రామాల్లోని 25 మంది రైతుల నుంచి 31.08 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.6.20 కోట్ల విలువ చేసే పరిహారం చెక్కులను రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 150 గజాల చొప్పున ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హత ఆధారంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు 75 గజాల ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుందన్నారు.
మెనూ అమలు చేయాలి
అనంతరం తాండూరులోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ సందర్శించారు. సదుపాయాలపై ఆరా తీశారు. వసతి గృహ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యం మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయించాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి ఉన్నాయా అని అడగ్గా.. సిబ్బంది లేవని సమాధానం చెప్పారు. దీంతో క్రీడా సామగ్రిని సమకూరుస్తానని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ థారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్ తదితరులు ఉన్నారు.
సన్నబియ్యం పంపిణీలో పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు
అనంతగిరి: జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సన్నబియ్యం పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వరాదని ఆదేశించారు. గోదాముల్లో బియ్యం కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన లగచర్ల రైతులకు చెక్కులు అందజేత


