దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరం
అత్తాపూర్: వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్‌లోని ఎన్‌ఎంగూడ చౌరస్తాలో బోయ రమేష్, టి.గురుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ... మండుతున్న ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. స్థానిక నేతలు సర్దార్ హర్మిందర్‌సింగ్, నాగరాజు, రవీందర్‌గౌడ్, రమాదేవి, యాదయ్య, ఫరూఖ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
మణికొండ: వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని విరివిగా ఏర్పాటు చేయాలని భారత్ వికాస్ పరిషత్ మణికొండ శాఖ అధ్యక్షుడు, ఎంప్లాయీస్ కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.పెంటారెడ్డి అన్నారు. నవ సేవా సంకల్ప ట్రస్ట్ వారు భాగ్యలక్ష్మి కాలనీ దుర్గామాత దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నీటి దానంతో ఎంతో పుణ్యం వస్తుందన్నారు. మానవసేవే మాదవ సేవగా గుర్తించి తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.


