గ్లోబల్ గ్రీన్ మార్కెట్ ‘కోహెడ’
దేశంలో రెండో అతిపెద్దపండ్ల విపణి
● 199.12 ఎకరాల్లో నిర్మాణం ● ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.2,900 కోట్లు ● 67 శాతం నిధులు నాబార్డ్ రుణం ద్వారానే.. ● విదేశీ ఆహార ఉత్పత్తుల కోసంప్రత్యేకంగా హాల్ ● డీపీఆర్‌ను రెడీ చేసిన తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దేశంలోనే విస్తీర్ణంలో రెండో అతిపెద్ద మార్కెట్ తెలంగాణలో నిర్మితమవుతోంది. ప్రస్తుతం 200 ఎకరాల్లో హర్యానాలోని ఐఐహెచ్‌ఎం గనౌర్ అంతర్జాతీయ ఉద్యానవన మార్కెట్ నిర్మాణంలో ఉంది. రూ.2 వేల కోట్ల వ్యయంతో పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంచుమించు ఇదే స్థాయిలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో 199.12 ఎకరాల విస్తీర్ణంలో ‘కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్’ను నిర్మిస్తున్నారు. మొత్తం రూ.2,900.43 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం నిధులను వెచ్చిస్తుండగా..మిగిలిన 67 శాతం నాబార్డ్ నుంచి టర్మ్ లోన్ రూపంలో సమీకరించనుంది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ విభాగం కోహెడ హోల్‌సేల్ మార్కెట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను రూపొందించి న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డుకు అందజేసింది.
● ప్రతిపాదిత కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌లో పండ్లు, పూలు, పాలు, మాంసం, కోళ్ల వ్యాపారంతో పాటు సమద్ర ఉత్పత్తులను విక్రయిస్తారు. దీన్ని ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్రూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్), పీపీపీ రెండు విధానాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈపీసీ విధానానికి 167.85 ఎకరాలు, పీపీపీ విధానంలో 31.27 ఎకరాలను కేటాయించారు. ఈపీసీలో వేలం హాళ్లు, షెడ్లు, విదేశీ ఫ్లాగ్‌షిప్ పెవిలియన్, రిటైల్ జోన్లు, మినీ డేటా సెంటర్, కార్మికుల విశ్రాంతి గదులు, పాలీక్లినిక్, పోలీసు ఔట్‌పోస్టు, పార్కింగ్, ఎస్‌టీపీలు, రహదారులు వంటివి నిర్మిస్తారు. పీపీపీ విధానంలో పెట్రోల్ పంపులు, టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఛార్జింగ్ స్టేషన్, శీతల గిడ్డంగులు, షాపులు, ప్రాసెసింగ్ సెంటర్ల వంటివి ఉంటాయి. ఈపీసీ అభివృద్ధి పనులకు రూ.2,044 కోట్లు, పీపీపీ విధానంలో రూ.856.43 కోట్ల అభివృద్ధి పనుల వ్యయాన్ని అంచనా వేశారు.
● ఫ్రాన్స్‌లోని రుంగిస్ మార్కెట్, లండన్‌లోని న్యూ కోవెంట్ గార్డెన్ మార్కెట్, బర్మింగ్‌హామ్‌లోని బర్మింగ్‌హామ్ హోల్‌సేల్ మార్కెట్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని ఫుడ్ సెంటర్, అమెరికాలోని యూనియన్ స్క్వేర్ గ్రీన్ మార్కెట్, ఫెర్రీ ప్లాజా ఫార్మర్ బజార్, దుబాయ్‌లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్, కువైట్‌లోని ఆల్ఫోర్డ్ మార్కెట్లను అధ్యయనం చేసిన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు కోహెడ మార్కెట్‌ను డిజైన్ చేశారు. మొత్తం స్థలంలో 71.58 ఎకరాలను రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ సబ్ స్టేషన్ వంటి మౌలిక సదుపాయాల కోసమే కేటాయించారు.
విదేశీ ఉత్పత్తుల కోసం ప్రత్యేకం..
2047 నాటికి మార్కెట్ సామర్థ్యం సుమారు 13.6 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా. కోహెడ మార్కెట్ యార్డ్‌లో 8 షెడ్లు ఉంటాయి. రెండు సోలార్ రూఫ్ టాప్‌లతో కూడిన మెజనైన్ హాళ్లు, మరో రెండు సోలార్ రూఫ్ టాప్ హాళ్లు ఉంటాయి. అంతర్జాతీయ వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ఫ్లాగ్‌షిప్ పెవిలియన్ ఉంటుంది. ఇందులో విదేశీ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు చేసుకోవచ్చు.
మార్కెట్‌లో దేనికి ఎంత ఖర్చంటే? (రూ.కోట్లలో)
స్మార్ట్ మండి..
కోహెడ మార్కెట్‌ను ఆధునిక స్మార్ట్ మండిగా అభివృద్ధి చేయనున్నారు. స్మార్ట్ వీధి దీపాలు, ఎలక్ట్రానిక్ సైన్‌బోర్డ్‌లు, ఎన్విరాన్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, వీడియో మేనేజ్‌మెంట్, అనలిటిక్స్‌తో కూడిన నిఘా వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్, మినీ డేటా సెంటర్ ఉంటుంది. ఇక్కడ మౌలిక సేవలన్నీ సాంకేతికతతో అనుసంధానమై ఉంటాయి.
రోజుకు 3 లక్షల లీటర్ల నీటి సరఫరా
ఔటర్ రింగ్ రోడ్ నుంచి కోహెడ మార్కెట్ వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించారు. 3.61 ఎకరాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల కోసంకేటాయించారు. మిషన్ భగీరథ నుంచి రోజుకు 3 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. రూ.5.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక పైప్‌లైన్ వేయనున్నారు. మార్కెట్‌లో ప్రైవేట్ శీతల గిడ్డంగులు, రిటైల్ షాప్‌లతో పాటు ఆఫీసులు, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్, సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, వాటర్ అండ్ వేపర్ హీట్ ట్రీట్‌మెంట్లు ప్లాంట్ల వంటివన్నీ ఉంటాయి. సిబ్బంది, కార్మికులకు గృహాలను సైతం నిర్మించనున్నారు.


