కాంట్రాక్టు కార్మికుడి మృతి
యాచారం: ఓ కాంట్రాక్టు కార్మికుడు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని గునుగల్ క్రీడాక్షేత్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. గునుగల్ గ్రామానికి మహ్మద్ జహంగీర్ కొన్నేళ్లుగా స్థానిక క్రీడాక్షేత్రంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులు నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కూప్పకూలిపోయాడు, గమనించిన కూలీలు వెంటనే యాచారం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు పి.బ్రహ్మయ్య, చందునాయక్ తదితరులు క్రీడా క్షేత్రం వద్దకు వెళ్లి మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందజేయాలని.. కుటుంబంలో ఒకరికి క్రీడా క్షేత్రంలో పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ మేరకు వారు క్రీడాక్షేత్రం అధికారి శ్రీకాంత్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం.


