ఫ్యూచర్ సిటీలో విలీనం చేయండి
మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం నుంచి కలెక్టరేట్ వరకు ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలం నుంచి కేవలం తుమ్మలూరు, మెహబ్బత్‌నగర్‌ను విలీనం చేసి మిగిలిన 28 పంచాయతీలను వదిలేశారన్నారు. గతంలో ప్రజా ప్రయోజనాల కోసం మహేశ్వరం మండల రైతులు సుమారు 20 వేల ఎకరాల భూమి కోల్పోయారన్నారు. ఫ్యూచర్ సిటీలో మండలాన్ని విలీనం చేస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఇప్పటికై నా మండలంలోని మిగిలిన 28 పంచాయతీలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ మేరకు మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు బైక్ ర్యాలీగా వచ్చి ప్రజావాణిలో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. త్వరలో సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విలీనం చేయాలని కోరుతామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఆర్‌ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుఫతి, ప్రధాన కార్యదర్శి యాదగిరిగౌడ్, గౌరవ అధ్యక్షుడు మనోహర్, జేఏసీ నాయకులు జంగయ్య, చంద్రయ్య, నర్సింహ, ఈశ్వర్, మోహన్‌రెడ్డి, యాదయ్య గౌడ్, దత్తు నాయక్, యాదీష్, సుదర్శన్ యాదవ్, రాజు నాయక్, పాండు నాయక్, నర్సింహ యాదవ్, రమేష్, సీతారామ్ నాయక్, విఠల్ నాయక్, లాజర్, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు జేఏసీ నాయకుల బైక్‌ర్యాలీ
ప్రజావాణిలో వినతిపత్రం అందజేత


