సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఽసిలిండర్ ధరను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర పెంచి పేదలపై ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్ మాట్లాడుతూ.. తమది పేదల ప్రభుత్వం అని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెబుతున్న కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు విశ్వం, కొంకళ్ల చెన్నయ్య, బస్వం, అందె మోహన్, దిలీప్, సత్తయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్


