గ్రహణం
● ముగ్గు పోసి వదిలేసిన లబ్ధిదారులు ● బిల్లులు రాక నిలిచిన నిర్మాణాలు
20 ఇళ్ల మంజూరుకు ఇద్దరే నిర్మించారు
కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రజలు అనాసక్తి చూపుతున్నారు. ఇళ్లు లేని పేద ప్రజలకు విడతల వారీగా నగదు ఇచ్చి వారికి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తూరు మండలంలోని మక్తగూడను పైలట్ గ్రామంగా ఎంపిక చేసి మొదటి దశలో 20 ఇళ్లు మంజూరు చేసింది. ఏడుగురు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపగా నలుగురు నిర్మాణాలను ప్రారంభించారు. మక్తగూడ పంచాయతీ పరిధి పెద్దగుట్టతండాలో హరిపాల్ సింగ్, హుంకి నిర్మిస్తున్న ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ పూర్తయింది. వారు అధికారులను సంప్రదించగా ఫొటోలు, వివరాలు సేకరించి ఉన్నాతాధికారులకు నివేదిక అందజేశారు. నేటికీ మొదటి విడత రూ.లక్షల మంజూరు కాకపోవడంతో ఎదురుచూపడం తప్పడం లేదు.
బిల్లులు ఇస్తే పూర్తి
ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేస్తుందని చెప్పడంతో పనులు ప్రారంభించా. బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తయింది. అధికారులు బిల్లుల వివరాలు తీసుకున్నారు. త్వరగా బిల్లులు మంజూరైతే నిర్మాణం పూర్తి చేసుకుంటా
– హరిపాల్‌సింగ్, పెద్దగుట్టతండా, మక్తగూడ పంచాయతీ


