ఫాంహౌస్‌లో ముజ్రా పార్టీ
మొయినాబాద్: పుట్టిన రోజు వేడుకల పేరుతో ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు భగ్నం చేశారు. అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న ఏడుగురు యువతులతోపాటు 13 మంది యువకులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎత్‌బార్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ లుక్మాన్ తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఎత్‌బార్‌పల్లి రెవెన్యూలోని హాలీడే హోమ్ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని యూసుఫ్‌గూడ, బోరబండ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లింగంపల్లి, బోయిన్‌పల్లి, గోల్కొండ, టోలిచౌకి, పాతబస్తి, ఆసిఫ్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాలకు చెందిన 12 మంది స్నేహితులను బర్త్‌డే పార్టీకి తీసుకొచ్చాడు. వారితోపాటు కొంత కాలంగా నగరంలోని సికింద్రాబాద్, రాజేంద్రనగర్, రాంనగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉంటున్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు యువతులను సైతం ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు. అందరూ కలిసి మద్యం, గంజాయి సేవిస్తూ మత్తులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు అర్ధరాత్రి ఫాంహౌస్‌పై దాడి చేశారు. పట్టుబడిన యువతులను బాబు, రీనా అనే వ్యక్తులు తీసుకొచ్చినట్లు తెలిసింది. వీరిలో ఓ యువతి గతంలో జరిగిన ము జ్రా పార్టీలో సైతం పట్టుబడినట్లు సమాచారం.
గంజాయి, మద్యం స్వాధీనం
ఘటనా స్థలంలో 62 గ్రాముల గంజాయి, భారీగా మద్యం బాటిళ్లు లభించాయి. నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతీయువకులను మొయినాబాద్ పీఎస్‌కు తరలించి విచారణ చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం వీరిని సీన్‌రీ కన్‌స్ట్రక్షన్ యువతీయువకులను ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు. అనంతరం కేసు నమోదు చేసి బుధవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. ఫాంహౌస్ యజమానిపై కేసు చేసినట్లు తెలిపారు.
ఎస్‌హెచ్‌ఓకు చీవాట్లు..?
ఎత్‌బార్‌పల్లి ఫాంహౌస్‌లో జరిగిన ముజ్రా పార్టీ విషయంలో మొయినాబాద్ ఎస్‌హెచ్‌ఓకు పోలీసులు ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు వచ్చే వరకు మీరేం చేస్తున్నారని, ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టకూడదా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.
అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు
ఎస్‌ఓటీ పోలీసుల దాడి
13 మంది యువకులు, ఏడుగురు యువతులకు రిమాండ్
62 గ్రాముల గంజాయి, భారీగా మద్యం స్వాధీనం
నిర్వాహకులతో పాటు
ఫాంహౌస్ ఓనర్‌పై కేసు


