శిఖం భూమిలో నిర్మాణాలు
పహాడీషరీఫ్: జల్‌పల్లి పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. 69 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే ఈ భూమిపై ఎప్పటి నుంచో కన్నేసిన కబ్జాదారులు గతంలో ప్రహరీలు నిర్మించేందుకు యత్నించారు. అప్పట్లో బాలాపూర్ రెవెన్యూ అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు. తాజాగా సెలవులు రావడంతో ఇదే అదునుగా భావించి మూడు భారీ ప్రహరీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రాత్రికి రాత్రే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. చెరువులో నీరు తగ్గుముఖం పడుతున్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేపట్టి, చివరకు తటాకం నిండినప్పుడు తమ నిర్మాణాలు మునిగిపోయాయంటూ గగ్గోలు పెట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఉస్మాన్‌నగర్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై, ప్రజావసరాల కోసం ఏదైనా కమ్యూనిటీ హాల్, క్రీడా మైదానం లాంటివి నిర్మించడానికి కూడా స్థలం దొరకని పరిస్థితులు జల్‌పల్లి మున్సిపాలిటీలో దాపురించాయి. అక్కడక్కడ మిగిలిన కొద్దిపాటి ప్రభుత్వ భూములనైనా కబ్జా బారిన పడకుండా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రాత్రిపూట పనులు చేస్తున్న అక్రమార్కులు


