పోలీసులను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

పోలీసులను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

Apr 11 2025 8:50 AM | Updated on Apr 11 2025 8:50 AM

పోలీసులను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

పోలీసులను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

యాచారం: విధుల్లో ఉన్న పోలీసులను బెదిరించిన వ్యక్తిపై యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని గునుగల్‌ గ్రామానికి చెందిన కుంటి శ్రీకాంత్‌ బుధవారం అర్ధరాత్రి గునుగల్‌ గేట్‌ వద్ద సిగరేట్‌ కాల్చుతూ అనుమానంగా తిరుగుతున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెళ్లి అతడిని విచారిస్తుండగానే తీవ్ర పదజాలంతో దూషిస్తూ బెదిరించాడు. అక్కడి నుంచి తప్పించుకొనిపోయి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ విషయమై యాచారం పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

ఇబ్రహీంపట్నం రూరల్‌: మతిస్థిమితం లేని ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాదర్‌గుల్‌ ప్రాంతానికి చెందిన బొచ్చల్ల సౌందర్య(24) అనే యువతి ఇంట్లో నుంచి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదిబట్ల పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.

అంతర్రాష్ట్ర మద్యాన్ని సరఫరా చేసే

బెడ్‌ రోలర్‌ అరెస్ట్‌

నాంపల్లి: అంతరాష్ట్ర మద్యాన్ని నగరానికి దిగుమతి చేసే వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా గురువారం హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సోదాలు జరిపారు. ప్లాట్‌ఫారం నెం–6 మీద బ్యాగ్‌తో రైళ్లలో పనిచేసే ఒక బెడ్‌ రోలర్‌ వేచి ఉండటాన్ని గమనించారు. అడ్డగించి బ్యాగు తెరి చూడగా అందులో వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిల్స్‌ కనిపించాయి. ఈ మద్యాన్ని హరియాణా నుంచి హిసార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లుగా బెడ్‌ రోలర్‌ ఒప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అమానిగంజ్‌ చోయ్‌, ఫైజాబాద్‌కు చెందిన రామ్‌ సరన్‌ కుమారుడు శివ ‘జైపూర్‌–హైదరాబాద్‌’నగరాల మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బెడ్‌ షీట్లను మార్చే బెడ్‌ రోలర్‌గా పనిచేస్తున్నారు. అతను ఓ కాంట్రాక్టర్‌ కింద రైళ్లలో బెడ్‌ షీట్స్‌ను శుభ్రం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. హరియాణాలో తక్కువ ధరకు లభించే బ్లెండర్స్‌ ప్రైడ్‌–18 బాటిల్స్‌, 8 పీఎం–10 విస్కీ బాటిల్స్‌ను హైదరాబాద్‌కు రైలులో తీసుకువచ్చాడు. వీటి విలువ సుమారు రూ.32,160 గా ఉంటుందని హైదరాబాద్‌ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అంతర్రాష్ట్రానికి చెందిన మద్యాన్ని సరఫరా చేసేందుకు అతడి వద్ద ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కత్తిపోట్లకు గురైన గిరిజన మహిళ మృతి

నాగోలు: మూడు రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన వర్ధ్య లక్ష్మి అనే గిరిజన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎల్‌బీనగర్‌ పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 8న రాత్రి సరూర్‌నగర్‌ పోస్తాఫీస్‌కు వెళ్లే దారిలో ఉన్న రిషి కిచెన్‌ వెను మరి కొందరు మహిళతో కలిసి ఆమె వేచి ఉంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి లక్ష్మిపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిన ఆమెను దిల్‌సుఖ్‌నగర్‌లోని కృతిక హాస్పిటకు తరలించారు. హాస్పిటల్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత లక్ష్మి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శాంతిభద్రతలకు

విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ఎల్‌బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్‌

లింగోజిగూడ: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్‌బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12 నిర్వహించనున్న ర్యాలీ సన్నాహక సమావేశం గురువారం కర్మన్‌ఘాట్‌లోని లక్ష్మీకన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిదిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ... ర్యాలీ రోజు ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఉందని సిబ్బంది అక్కడికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. నిర్వాహకులు ఎలాంటి సంఘటనలు జరగకుండా కొంతమంది వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ర్యాలీ సమయంలో రోడ్డు మొత్తం వెళ్లకుండా ఒకవైపు నుంచి మాత్రమే వెళ్లేలా చూసుకోవాలన్నారు. ర్యాలీలో భారీ శబ్దాలు వచ్చే వాహనాలను వాడకుండా చూడాలని సూచించారు. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ కృష్ణయ్య, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement